74వేల మార్క్‌కు సెన్సెక్స్‌

Mar 6,2024 21:05 #Business

నూతన గరిష్టాలకు సూచీలు

బ్యాంకింగ్‌ షేర్ల మద్దతు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నూతన రికార్డ్‌లను చేరాయి. కొనుగోళ్ల మద్దతుతో తొలిసారి సెన్సెక్స్‌ 74వేల పాయింట్ల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 22,400 దాటేసింది. కిత్రం సెషన్‌తో పోలిస్తే బుధవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్ది సేపటికి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, విత్త షేర్లు పరుగులు పెట్టాయి. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 409 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 74,086 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 118 పాయింట్లు లేదా 0.53 శాతం లాభపడి 22,474కు చేరింది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో ఉదయం 73,587.70 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సూచీ.. ఓ దశలో 73,321 కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 74,151, నిఫ్టీ 22,497 గరిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్‌ అయ్యాయి.కొటాక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, టైటన్‌, టిసిఎస్‌ తదితర స్టాక్స్‌ 2.45 శాతం మేర పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.65 శాతం, 1.9 శాతం నష్టాలను చవి చూశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్‌ సూచీ 0.8 శాతం, ఫైనాన్సీయల్‌ సూచీ 0.6 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు లోహ సూచీ 2.5 శాతం, రియాల్టీ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి.

➡️