ఆసుపత్రిల్లో అదనంగా ఒక్క రోజు వైద్య బీమా పరిష్కారాల్లో ఆలస్యం

May 4,2024 21:01 #Business, #health, #Insurance
  • 43 శాతం మంది ఆందోళన
  • లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : వైద్య బీమా పరిష్కారాల్లో ఆసుపత్రులు, బీమా కంపెనీలు పాలసీదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సకాలంలో క్లెయింలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయి. దీంతో పాలసీదారులపై భారం పడుతోంది. క్లెయిం సెటిల్‌మెంట్‌ను ఆలస్యం చేస్తూ ఆసుపత్రుల్లో అదనంగా ఒక్క రోజు ఉండేలా చేస్తున్నారని 43 శాతం మంది పాలసీదారులు ఆందోళన వ్యక్తం చేశారు. లోకల్‌ సర్కిల్స్‌ నిర్వహించిన ఓసర్వేలో ఇది వెల్లడయ్యింది. బీమా క్లెయింల పట్ల లోకల్‌ సర్కిల్స్‌ 302 జిల్లాల్లోని 39,000 మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారు.
దేశంలో సాధారణ బీమా పాలసీలను కలిగి ఉన్న భారతీయులలో మోటారు, ఆరోగ్య బీమాలు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. తరువాత గృహ బీమా ఉంది. వైద్య బీమా క్లెయింలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మెజారిటీ ప్రజలు తెలిపారు. బీమా రెగ్యూలేటరీ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డిఎ) నిబంధనల ప్రకారం.. బీమా కంపెనీలకు అందిన క్లెయిమ్స్‌ల్లో తిరస్కరించినవి, పరిష్కరించినవి తమ వెబ్‌సైట్‌లో పెట్టాలని 93 శాతం మంది పౌరులు డిమాండ్‌ చేశారు. బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించడం లేదా పాక్షిక మొత్తాన్ని మాత్రమే ఆమోదించడాన్ని ఎక్కువ మంది తప్పుబట్టారు. క్లెయిమ్‌ ఆమోదించబడే సమయానికి, రోగి చాలా అలసిపోతున్నారని వాపోయారు. అప్పటికీ బీమా కంపెనీ ఆమోదించని ఖర్చుల కోసం పోరాడే శక్తి వారికి ఉండదు. అలా చేయడానికి వారు మరో రోజు ఆసుపత్రిలో తిరిగితే, ఆ అదనపు రాత్రి బస ఖర్చు వారే భరించాలి. వినియోగదారుల వ్యవహారాల శాఖకు అందిన మొత్తం 5.5 లక్షల పెండింగ్‌ వినియోగదారుల ఫిర్యాదులలో దాదాపు మూడింట ఒక వంతు లేదా 1.6 లక్షల కేసులు బీమా రంగానికి చెందినవే కావడం గమనార్హం.

➡️