ఆహార భత్రకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐతో ఒప్పందం

-ఫుడ్‌ సేఫ్టీ కమిషనరు వెంకటేశ్వర్‌
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఢిల్లీలోని భారత ఆహార భద్రత, నియంత్రణ శాఖ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఫుడ్‌ సేఫ్టీ కమిషనరు సలిజామల వెంకటేశ్వర్‌ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించి రూ.80 కోట్లు సమకూరాయని, ఈ నిధులతో రాష్ట్రంలో ఫుడ్‌ ల్యాబ్‌లు, మొబైల్‌ ఫుడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ఫుడ్‌ ల్యాబ్‌లు, వాటర్‌ ల్యాబ్‌లు, ఎన్‌ఫోర్సుమెంట్‌ సిబ్బంది పనితీరు ఆదివారం సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌, వాటర్‌కు సంబంధించి నమూనాలను పరీక్షించాలని సూచించారు. ఏదైనా ఆహార పదార్థాల్లో నిషేధిత ఫుడ్‌ కలర్స్‌, సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ లేదా ఒకసారి ఉపయోగించిన వంట నూనెలనే మళ్లీ ఉపయోగిస్తున్నారని తెలిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారభద్రత చట్టంను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వంటనూనెల పునర్‌ వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి విశాఖ, తిరుపతి, గుంటూరులో మూడు ఫుడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, కార్యకలాపాలు మొదలుపెడతామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు మొబైల్‌ ఫుడ్‌ ల్యాబ్‌లు పని చేస్తున్నాయని, త్వరలో మరో పది మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌లు వినియోగంలోకి వస్తాయని వివరించారు.

➡️