మేము సైతం ఎన్నికల విధుల్లో..

May 13,2024 21:44 #Election Duty, #of the disabled

వికలాంగ సిబ్బందితో ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం
ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్‌ :నంద్యాల, కర్నూలు జిల్లాల్లో వికలాంగుల సిబ్బందితో నాలుగు పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రజాస్వామ్య స్పూర్తిని, ఆత్మ విశ్వాసాన్ని నింపే దిశగా ప్రత్యేక చర్యలను జిల్లా ఎన్నికల అధికారులు చేపట్టారు. అందులో భాగంగా కర్నూలు నియోజకవర్గం ఎస్‌ఎపి క్యాంపులోని కట్టమంచి రామలింగారెడ్డి స్మారక మున్సిపల్‌ పాఠశాలలో ఆదర్శ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల కేంద్రాన్ని రంగు రంగుల ఫ్లెక్సీ బోర్డులతో, స్వాగత తోరణాలతో తీర్చిదిద్దారు. ఇందులో పనిచేసే ఎన్నికల సిబ్బంది అందరూ కూడా వికలాంగులు కావడం ప్రత్యేకత సంతరించుకుంది. సాధారణ సిబ్బందికి ఏమాత్రమూ తీసిపోకుండా ఇక్కడ ఎన్నికల విధులను వారు నిర్వర్తించడం విశేషమని ఎస్‌ఎపి క్యాంపు కేంద్రాన్ని సందర్శించిన ప్లయింగ్‌స్కాడ్‌ ప్రసాదరావు, ప్రభాకర్‌లు వివరించారు. వారి విధులను పరిశీలించి అభినందించారు. నంద్యాల జిల్లాలో 29, కర్నూలు జిల్లాలో 26 మండలానికి ఒకటి చొప్పున మొత్తం 55 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాలో మహిళా సిబ్బందితో ఎనిమిది, యూత్‌ సిబ్బంది రెండు పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లను ప్రత్యేకంగా ఆకర్షించేందుకు ఈ విధంగా ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజన తెలిపారు.

➡️