దలాల్‌ స్ట్రీట్‌లో ‘ఎన్‌డిఎ’పై భయాలు..!

May 9,2024 21:32 #Business

మెజారిటీపై అనుమానాలు..
ఇన్వెస్టర్లలో ఆందోళన
బేర్‌ పంజాతో సెన్సెక్స్‌ 1060 పాయింట్ల పతనం
రూ.7.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌లో ఎన్నికల భయాలు మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగా ఉండకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు దిగేలా చేశాయి. గురువారం సెషన్‌లో భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అమ్మకాల ఒత్తిడితో లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 1062 పాయింట్లు లేదా 1.45 శాతం పతనమై 72,404.17కు క్షీణించింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 345 పాయింట్లు లేదా 1.55 శాతం కోల్పోయి 21,957 వద్ద ముగిసింది. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి.
సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశల్లో పోలింగ్‌ పూర్తయిన వేళ పోలింగ్‌ సరళిపై మదుపరుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం వారిలో సన్నగిల్లింది. ముందుగా ఊహించినట్లు ఫలితం ఉండకపోవచ్చన్న అంచనాలు మార్కెట్ల పతనానికి దారి తీశాయి. ”ఎన్‌డిఎ ప్రధాని అభ్యర్థిగా మళ్లీ నరేంద్ర మోడీని ప్రకటించినప్పటికీ.. మెజారిటీపై అనుమానాలు నెలకొన్నాయి. బిజెపి ఊహించిన దానికంటే బలహీనమైన మెజారిటీని పొందుతుందనే భయమే మార్కెట్లలో అస్థిరత పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు” అని ఐఎఫ్‌ఎ గ్లోబల్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అభిషేక్‌ గోయెంకా రాయిటర్స్‌తో తెలిపారు. సమీప భవిష్యత్‌లో మార్కెట్‌ను అంచనా వేయడానికి కొలమానంగా భావించే వోలటాలిటీ ఇండెక్స్‌ ఇండియా (విఐఎక్స్‌) పెరిగి 18 శాతానికి చేరడంతో ఇన్వెస్టర్లలో మరింత ఆందోళన చోటు చేసుకుందని నిపుణులు పేర్కొన్నారు. 2023 మార్చి త్రైమాసికంలో కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశజనకంగా ఉండటం కూడా ప్రతికూలతను పెంచాయి.
ముఖ్యంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు సూచీలను ఒత్తిడికి గురి చేశాయి. దలాల్‌ స్ట్రీట్‌లో ఒక్క పూటలో రూ.7.3 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.400 లక్షల కోట్ల నుంచి రూ.393.73 లక్షల కోట్లకు పడిపోయింది.
సెన్సెక్స్‌ా30లో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సిఎల్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని స్టాక్స్‌ ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఎల్‌అండ్‌టి, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐటిసి, ఏషియన్‌ పేయింట్స్‌, బిపిసిఎల్‌, కోల్‌ ఇండియా, ఒఎన్‌జిసి, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తదితర షేర్లు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో ఆటో మినహా అన్ని రంగాలు క్షీణించాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు 3.2 శాతం నష్టపోయాయి. మెటల్‌ 2.9 శాతం, ఎఫ్‌ఎంసిజి 2.5 శాతం దిగజారాయి. ఫార్మా, రియాల్టీ సూచీలు 2శాతం చొప్పున పతనమయ్యాయి.

➡️