చైనా నుంచి పెరిగిన భారత దిగుమతులు

Apr 21,2024 08:43 #Business, #China, #Exports, #India

న్యూఢిల్లీ : చైనా దిగుమతులపై ప్రేలాపణలు చేసే బిజెపి సర్కార్‌ ఆ దేశం ఉఉత్పత్తుల కొనుగోళ్లను మరింత పెంచింది. విదేశీ వస్తువులను భారీగా అడ్డుకుంటామని.. స్వదేశీ భజనా చేసే పాలకులు ఆచరణలో మరో విధంగా వ్యవహారిస్తున్నారు. పొరుగు దేశం చైనా నుంచి భారత్‌ దిగుమతులు అమాంతం పెరగడమే ఇందుకు నిదర్శనం. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో చైనా నుంచి భారత్‌ 101.75 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.50 లక్షల కోట్లు) విలువ చేసే దిగుమతులు చేసుకుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గణంకాలు చెబుతున్నాయి. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే 3.29 శాతం పెరిగాయి. చైనా నుంచి ఇతర ప్రపంచ దేశాల దిగుమతులు క్షీణించగా.. భారత దిగుమతులు పెరగడం గమనార్హం. ఆ దేశానికి భారత ఎగుమతులు 8.07 శాతం పెరిగి కేవలం 16.67 బిలియన్‌ డాలర్లు (రూ.1.38 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఎగుమతులు తక్కువగా ఉండి.. దిగుమతులు పెరగడంతో భారత్‌కు 85 బిలియన్‌ డాలర్లు(రూ.7 లక్షల కోట్లు) పైగా వాణిజ్య లోటు నమోదయ్యింది. కాగా.. మరోవైపు 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో చైనా దిగుమతులు 5.5 శాతం తగ్గాయి. భారత ఎగుమతులు 7.1 శాతం పెరిగాయి. ముడి ఇనుప ఖనిజం, పత్తి నూలు, క్వార్ట్జ్‌, ముడి అల్యూమినియం ఉత్పత్తులు చైనాకు అధికంగా ఎగుమతి చేయబడ్డాయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న వాటిల్లో అన్ని రకాల మెషనరీలు ఉండగా.. వీటి వాటా 50 శాతంగా ఉంది. ప్లాస్టిక్‌, రసాయనాలు, స్టీల్‌, స్టీల్‌ ఉత్పత్తులు, ఎరువులు అధికంగా దిగుమతి అయ్యాయి.

➡️