ఎఐతో సంపన్నులకే లబ్ధి

May 21,2024 21:05 #Business

ఉద్యోగాలు పోతాయ్
జెఫ్రీ హింటన్‌ వెల్లడి
కృత్రిమ మేధా (ఎఐ)తో సంపన్నులకే లబ్ధి చేకూరనుందని టెక్నాలజీ నిపుణుడు, ఎఐ గాడ్‌ ఫాదర్‌గా గుర్తింపు పొందిన జెఫ్రీ హింటన్‌ అన్నారు. నూతన టెక్నాలజీ ఉత్పాదకతను పెంచి సంపదను సఅష్టించినా అది తిరిగి సంపన్నుల ఖజానాలోకే వెళ్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. జెఫ్రీ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఎఐతో ప్రపంచానికి మేలు చేకూరి సంపదను సమకూర్చినప్పటికీ.. ఈ టెక్నాలజీతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, సామాన్యులకు ఆ సంపద చెందకుండా కేవలం డబ్బున వారి చేతుల్లోకే వెళ్తుందన్నారు. ఇది సమాజానికి చాలా చేటు చేస్తుందని హెచ్చరించారు. ఎఐ వల్ల నష్టపోయిన ప్రజలకు కనీస రాబడిని ప్రభుత్వం సమకూరిస్తే వారు ఇబ్బందులకు లోనుకాకుండా చూడవచ్చని సూచించారు.
ఎఐతో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని, మానవాళి విధ్వంసానికి ఇది దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఎఐతో పొంచి ఉన్న ముప్పుపై జెఫ్రీ హింటన్‌ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ మేధాతో మనుషులు చేసే ఉద్యోగాలు కనుమరుగవుతాయని, దీనిపైనే తాను కలత చెందుతున్నానని పేర్కొన్నారు. కార్పొరేట్‌ సంస్థలు తమ సేవలను మరింత సులభతరం చేసుకోవడానికి, వ్యయాలను పొదుపు చేసుకోవడానికి ఎఐలను అభివృద్థి చేసుకుంటున్నాయి. అన్ని టెక్నాలజీ కంపెనీలు ప్రస్తుతం ఎఐపైనే దృష్టి పెట్టాయి. పోటాపోటీగా ఈ సాంకేతికతను అభివృద్థి చేయడంలో బిజీగా ఉన్నాయి.

➡️