పిఎన్‌బి లాభాలు మూడింతలు

May 9,2024 21:18 #Business

క్యూ4లో రూ.3,010 కోట్ల ఆర్జన
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3.010 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022-23 ఇదే క్యూ4లో రూ.1,159 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్‌ కీలక ఆదాయం పెరగడం, మొండి బాకీలు తగ్గడం లాభాల్లో భారీ పెరుగుదలకు దోహదం చేశాయి. క్రితం క్యూ4లో పిఎన్‌బి మొత్తం ఆదాయం రూ.32,361 కోట్లకు చేరింది. ఇంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.27,269 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2024 మార్చి 31 నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 5.73 శాతానికి తగ్గాయి. 2023 మార్చి ముగింపు నాటికి ఏకంగా 8.74 శాతం జిఎన్‌పిఎలతో ఒత్తిడిలో ఉంది. కాగా.. నికర నిరర్థక ఆస్తులు 2.72 శాతం నుంచి 0.73 శాతానికి పరిమితమయ్యాయి. 2023-24లో బ్యాంక్‌ మొత్తం నికర లాభాలు మూడు రెట్లు పెరిగి రూ.8,245 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం 2022-23లో రూ.2,507 కోట్ల లాభాలు గడించింది.

➡️