తగ్గిన ఐడిబిఐ బ్యాంక్‌ ఎన్‌పిఎలు

May 4,2024 21:04 #Business, #idbi bank
  • క్యూ4 లాభాల్లో 44% వృద్థి

న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్‌ మొండి బాకీలు తగ్గడంతో పాటుగా లాభాల్లో వృద్థిని ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 44 శాతం వృద్థితో రూ.1,628.46 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022-23 ఇదే క్యూ4లో రూ.1,133.4 కోట్ల లాభాలు ప్రకటించింది. గడిచిన క్యూ4లో ఈ ప్రయివేటు రంగ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 12 శాతం పెరిగి రూ.3,688 కోట్లుగా చోటు చేసుకుంది. మార్చి ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 4.53 శాతానికి తగ్గాయి. 2022-23 ఇదే మార్చి ముగింపు నాటికి 6.38 శాతం స్థూల ఎన్‌పిఎలు నమోదయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు 0.92 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయి. 2023-24 తుది డివిడెండ్‌ కింద ప్రతీ రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.1.50 డివిడెండ్‌ చెల్లించడానికి బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ మొత్తం నికర లాభాలు 55 శాతం పెరిగి రూ.5,634 కోట్ల ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. 2022-23లో రూ.3,645 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.24,942 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన 2023-24లో రూ.30,037 కోట్లకు చేరింది. శుక్రవారం బిఎస్‌ఇలో ఐడిబిఐ బ్యాంక్‌ షేర్‌ 1.91 శాతం తగ్గి రూ.89.41 వద్ద ముగిసింది.

➡️