మార్కెట్లకు ‘సుప్రీం’ భయాలు

  • సెన్సెక్స్‌ 617 పాయింట్ల పతనం
  • రూ.3 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి
  • ఎస్‌బిఐ షేర్లకు ఎన్నికల బాండ్ల దెబ్బ

ముంబయి : ఎన్నికల బాండ్ల గుట్టు విప్పాల్సిందేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆ ప్రభావం స్టాక్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఎన్నికల బాండ్ల వల్ల బిజెపి భారీగా లబ్ధి పొందిందని ఇప్పటికే అనేక రిపోర్టులు స్పష్టం చేయగా.. తాజాగా అత్యున్నత న్యాయస్థానం వాటి పూర్తి వివరాలను వెల్లడించాల్సిందేనని పేర్కొనడంతో మోడి సర్కార్‌ ఇరుకున పడనుందనే అంచనాల్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఎటు దారి తీస్తోందోననే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు మరింత ఒత్తిడిని పెంచాయి. ఈనేపథ్యంలోనే సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 617 పాయింట్లు పతనమై 73,503కు జారుకుంది. ఉదయం 74,175.93 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా నష్టాల్లోనే ట్రేడింగ్‌ అయ్యింది. ఒక దశలో 73,433 కనిష్ఠాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద ముగిసింది.
అమ్మకాల దెబ్బకు బిఎస్‌ఇ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.3.15 లక్షల కోట్లు హరించుకుపోయి.. రూ.389.66 లక్షల కోట్లకు పరిమితమయ్యింది. ఆ మొత్తం మదుపర్లు నష్టపోయినట్లయ్యింది. 3,039 స్టాక్స్‌ పతనాన్ని చవి చూడగా.. 924 స్టాక్స్‌ రాణించగా.. మరో 118 సూచీలు యథాతథంగా నమోదయ్యాయి. దాదాపు పెద్ద సూచీలన్నీ నష్టాలను చవి చూశాయి. టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బిఐ, హెచ్‌యుఎల్‌, టాటా కన్స్యూమర్‌, బజాజ్‌ ఆటో, ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టిపిసి షేర్లు 1-3 శాతం పతనమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసిజి, చమురు, బ్యాంకింగ్‌, ఐటి, రియల్టీ, లోహ, విద్యుత్‌ రంగాల సూచీలు 0.5 నుంచి 1 శాతం మేర నష్టపోయాయి.

ఎస్‌బిఐ షేర్‌ విలవిల..
ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించేందుకు ఎస్‌బిఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. మార్చి 12 కల్లా (నేడు) సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో ఆ బ్యాంక్‌ సూచీలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం నుంచి ఎస్‌బిఐ షేర్లు పతనం వైపు పయనించాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 2శాతం నష్టపోగా.. తుదకు 1.86 శాతం పతనంతో రూ.773.50కు పడిపోయింది. ఇంట్రాడేలో రూ.770.70 కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి 12 తర్వాత ఒకేరోజు ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.

సెబీతో స్మాల్‌ క్యాప్‌ సూచీలపై ఒత్తిడి..
స్మాల్‌ క్యాప్‌ సూచీల కృత్రిమ ధర పెంపునపై దృష్టి సారిస్తున్నట్లు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) ఛైర్మన్‌ మాదాబి పూరి బుచ్‌ పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల నిబంధనలను మార్చనున్నట్లు ప్రకటించారు. దీంతో బిఎస్‌ఇలో స్మాల్‌ క్యాప్‌ సూచీ 2 శాతం, మిడ్‌ క్యాప్‌ సూచీ 0.24 శాతం చొప్పున పడిపోయాయి.

➡️