గారా శాఖలోని తనఖా బంగారం భద్రం

Dec 2,2023 20:45 #Business, #SBI
  • 60 బ్యాగ్‌లు మినహా : ఎస్‌బిఐ వెల్లడి

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా ఎస్‌బిఐ గారా శాఖలోని తనఖా బంగారం బ్యాగుల మాయంపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) వివరణ ఇచ్చింది. మాయమైన 86 బ్యాగ్‌ల్లో 26 ఇప్పటికే రికవరీ చేయబడ్డాయని ఎస్‌బిఐ విశాఖపట్నం డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పంకజ్‌ కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఖాతాదారులకు ఇప్పటికే సరైన సమాచారం అందించామన్నారు. వారి ప్రయోజనాలను బ్యాంకు చూసుకుంటుందని, ఖాతాదారులెవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తామని పంకజ్‌ కుమార్‌ హామీ ఇచ్చారు. రికవరీ చేసిన 26 బ్యాగ్‌ల్లో అభరణాలు సరిగ్గానే ఉన్నాయని ధృవీకరించబడ్డాయన్నారు. మిగిలిన బ్యాగ్‌ల రికవరీ కోసం ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ 60 బ్యాగులు మినహా గారా బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన మిగతా బంగారు సంచులు సరక్షితంగా ఉన్నాయని అన్నారు. తనఖా రుణాలు చెల్లించి వినియోగదారులు తమ అభరణాలను ఎప్పుడైనా తీసుకు వెళ్లవచ్చన్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఖాతాదారులు తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఖాతాదారులకు ఎవరికీ నష్టం జరగదని ఆయన హామీ ఇచ్చారు.

➡️