ధాన్యం బకాయిలు చెల్లించాలని ధర్నా

Jun 28,2024 20:45 #Dharna, #pay grain dues

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :ధాన్యం బకాయి సొమ్ములను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు సుంకరవారితోటలోని రైతుభరోసా కేంద్రం వద్ద రైతులు, కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం సొమ్ములివ్వకపోతే సార్వా సాగు చేయలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని నినదించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ధాన్యం బకాయి సొమ్ము చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ధాన్యం అమ్మి రెండు నెలలు దాటిపోతున్నా సొమ్ములు చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. ధాన్యం బకాయిల కోసం అన్నదాతలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో దాదాపు రూ.240 కోట్లు రైతులు, కౌలు రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఖరీఫ్‌ సాగు సమయం కావడంతో పెట్టుబడికి సొమ్ములు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతు భరోసా కేంద్రం అధికారికి వినతిపత్రం అందజేశారు.

➡️