జనరిక్‌ ఔషధ ఎగుమతుల్లో విస్తృత అవకాశాలు

Jun 27,2024 21:28 #Business

లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాపై కీలక దృష్టి
ఈ ఏడాది రూ.2.58 లక్షల కోట్ల ఎగుమతులు
ఫార్మాక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి
హైదరాబాద్‌ : జనరిక్‌ ఔషధ ఎగుమతుల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని ఫార్యాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ భాస్కర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో సీనియర్‌ డైరెక్టర్‌ లక్ష్మీ ప్రసన్నతో కలిసి ఉదరు భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 2023 నుంచి 2029 వరకు ఈ రంగంలో 10 బిలియన్‌ డాలర్లు (రూ.83వేల కోట్లు) రెవెన్యూకు అవకాశాలున్నాయన్నారు. ఇందుకు 15 కీలక ఔషధాలు మద్దతును అందించనున్నాయని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-మేలో భారత ఔషధ ఎగుమతులు 8.85 శాతం పెరిగి రూ.4.73 బిలియన్‌ డాలర్లకు చేరాయన్నారు. గతేడాది ఇదే రెండు నెలల్లో 4.35 బిలియన్ల ఎగుమతులు జరిగాయన్నారు. దేశంలో 748 యూనిట్లకు యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతులు ఉన్నాయని తెలిపారు. 2004-05లో 3.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత ఔషధ ఎగుమతులు.. 2023-24 నాటికి 27.85 బిలియన (రూ.2.32 లక్షల కోట్లు)కు చేరాయన్నారు. ఈ కాలంలో ప్రతీ ఏడాది సగటున 11 శాతం వృద్థి నమోదయ్యిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31 బిలియన్‌ డాలర్ల (రూ.2.58 లక్షల కోట్లు)కు చేరొచ్చని ఉదరు అంచనా వేశారు. కాగా.. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా దేశాలపై భారత ఫార్మా కంపెనీలు కీలక దృష్టిని సారించాయన్నారు.
ఆగస్ట్‌లో ఐపెక్స్‌..
ఫార్మెక్సిల్‌ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ ఫార్మా ఎగ్జిబిషన్‌ ఐపెక్స్‌ జరుగనుందని ఉదయ భాస్కర్‌ తెలిపారు. ఆగస్ట్‌ 28 నుంచి 30 వరకు గ్రేటర్‌ నోయిడాలోని ఐఇఎంఎల్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారత్‌ నుంచి 440 ఎక్స్‌ పోర్టర్స్‌ పాల్గని వారి ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని తెలిపారు. 120 దేశాల నుంచి 500 మంది ఓవర్సీస్‌ బిజినెస్‌ డెలిగేట్స్‌ ఇందులో పాల్గనే అవకాశం ఉందన్నారు.

➡️