అంకితభావంతో పనిచేయాలి

Mar 22,2024 21:46

 ప్రజాశక్తి-బొండపల్లి : రానున్న ఎన్నికలలో వైసిపి విజయానికి కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. శుక్రవారం మండలంలోని గొట్లాం గ్రామంలోని సత్యా కళ్యాణ మండపంలో మండల స్థాయి వైసిపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైసిపి మండల అధ్యక్షులు బొద్దల చిన్నంనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సంక్షేమ పథకాలు అందించిన ఘనత సిఎం జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. గ్రామస్థాయిలో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారిని పోలింగ్‌ బూత్‌లకు తరలించే బాధ్యతలను పార్టీ శ్రేణులు తీసుకోవాలని కోరారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాల్సిన అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ సురేష్‌బాబు, ఎంపిపి చల్ల చలంనాయుడు, పీరుబండి హైమావతి, ఎఎంసి చైర్మన్‌ వేమలి ముత్యాలునాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బివి.ప్రభూజీ, మహంతి రమణ, గొల్లు సతీష్‌, వైసిపి బోడసింగి జగదీశ్వర రావు, సీనియర్‌ నాయకులు మీసాల తులసీ రావు, ఈదిబిల్లి కృష్ణ, మాజీ ఎంపిపి బండారు బంగారం, బొత్స గురునాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️