అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి – కోటి సంతకాల సేకరణ

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సింగ్‌ నగర్‌ మాకినేని బసవ పున్నమయ్య స్టేడియంలో వాకర్స్‌ తో సిఐటియు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్‌ సిటీ సిఐటియు అధ్యక్షులు కే.దుర్గారావు మాట్లాడుతూ … అంగన్వాడీలు 35 రోజులకు సమ్మె చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం అంగన్వాడీలను పండగ పూట రోడ్లు పాలు చేసిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాత్రం సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారని ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. అంగన్వాడీలకు జీతాలు వెంటనే పెంచాలని కోరారు. అంగన్వాడీల సమ్మెకు ప్రజలు మద్దతు రోజురోజుకు పెరుగుతుందన్నారు. స్వచ్ఛందంగా వాకర్స్‌ సంతకాలు చేశారని ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మాని అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు పౌర సంక్షేమ సంఘాల సెంట్రల్‌ సిటీ కన్వీనర్‌ భూపతి రమణారావు కెవిపిఎస్‌ సెంట్రల్‌ సిటీ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ శ్రీనివాస్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ సెంట్రల్‌ సిటీ ప్రధాన కార్యదర్శి ఎం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

➡️