అంబేద్కర్‌ విగ్రహాల వద్ద అంగన్వాడీల నిరసనలు

Jan 19,2024 20:14

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 39వ రోజుకు చేరుకుంది. సమ్మెను విఫలం చేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అంగన్వాడీలు మాత్రం పట్టు సడలకుండా పోరాడుతున్నారు. అందులో భాగంగా గురువారం కలెక్టరేట్‌ వద్ద మానవహారం చేపటారు.ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ జూలై నెలలో వేతనాలు పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం ఎంత ఇస్తారో చెప్పి జీవో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు సమస్యలన్నీ పరిష్కరించామని చెప్పడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరిస్తే ఆదేశాలు ఎందుకివ్వరని ప్రశ్నించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

స్పృహతప్పి పడిపోయిన కార్యకర్త

బాడంగి : ప్రభుత్వం అంగన్వాడీల పైన ఉక్కు పాదం మోపుతూ సిడిపిఒలు, సూపర్‌వైజర్లు పెడుతున్న మానసిక ఇబ్బందులతో బాడంగి సమ్మె శిబిరంలో పెరుమాళి గ్రామానికి చెందిన కార్యకర్త అనురాధ గురువారం స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హుటాహుటిన స్థానిక సిహెచ్‌సికి తరలించి చికిత్స అందించారు. అంగన్వాడీ కార్యకర్తకు ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని సిఐటియు నాయకులు ఎ.సురేష్‌ అన్నారు.

కొత్తవలస : పట్టణంలో అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద ముఖ్యమంత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. సిఎం జగన్‌కు మంచి మనసు ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు కె.తులసి, శంకరావతి, సిఐటియు నాయకులు గాడి అప్పారావు పాల్గొన్నారు.

గజపతినగరం : స్థానిక బ్రిడ్జి జంక్షన్‌ నుంచి కాంప్లెక్స్‌ కూడలి వరకు అంగన్వాడీలు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షులు సుభాషిణి, సెక్టార్‌ లీడర్లు రమణమ్మ, రాములమ్మ, సన్యాసమ్మ, దమయంతి, నాగమణి, సుజాత, నారాయణమ్మ, జ్యోతి, రామలక్ష్మి పాల్గొన్నారు.

శృంగవరపుకోట : పట్టణంలోని దేవి కూడలిలో అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్వాడీలు నివాళులర్పించి, వినతిపత్రాన్ని అందజేశారు. తొలుత అంగన్వాడీల సమ్మె శిబిరం నుంచి ర్యాలీగా దేవి కూడలికి చేరుకొన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.శ్యామల, డి.జయలక్ష్మి, వి.మాణిక్యం, కె.సుశీల పాల్గొన్నారు.

జామి : స్థానిక అంబేద్కర్‌ కాలనీలోని అంబేద్కర్‌ విగ్రహం అంగన్వాడీలు నిరసన తెలిపారు. వీరికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కనకమహాలక్ష్మి, రామలక్ష్మి, శ్రీదేవి, వరలక్ష్మి, శారద పాల్గొన్నారు.

గంట్యాడ : గంట్యాడ ఎస్‌సి కాలనీలో అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్వాడీలు వినతులు అందించారు. అనంతరం గంట్యాడలో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు ఎం.కళాకుమారి, ఎల్‌.చంద్రవేణి, బి.వెంకటలక్ష్మి, ఆర్‌.ఎర్రయ్యమ్మ పాల్గొన్నారు.

➡️