అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు

Jan 25,2024 21:01

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సిబ్బందికి సూచించారు. జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో గురువారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో డిసెంబర్‌ మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన జిల్లాలో నమోదైన, దర్యాప్తులో ఉన్న నేరాల కేసులను సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, ఎన్‌డిపిఎస్‌, ఐటి యాక్ట్‌ కేసులు, మహిళలపై జరిగే అన్యాయాలు, ప్రాపర్టీ దొంగతనాలు వంటి కేసుల గురించిన వివరాలు విశ్లేషించి వాటి దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యత కేసుల గురించి అడిగి తెలుసుకొని వాటిలో శిక్షలు పడేలా చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలపై సమీక్ష నిర్వహించి తగు నిర్దేశాలు జారీచేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, రోడ్‌ భద్రతా నియమాలపై అవగాహన కల్పించి వాహన తనిఖీలు చేపట్టాలని, డ్రంకెన్‌ డ్రైవ్‌, ఓపెన్‌ డ్రింకింగ్‌ తనిఖీలు చేయాలని, బైకు, ఇళ్ల దొంగతనాలు జరగకుండా ఆస్తి నేరాలు నివారణకు గస్తీలను మరింత బలోపేతం చేసి, ప్రత్యేక బృందాలు నియమించి అపరిచిత, అనుమానిత కొత్త వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. బీట్‌ పాయింట్లను పెంచి బీట్‌ ఆఫీసర్‌ తరువుగా తనిఖీ చేయాలన్నారు. అపార్టెమెంట్లు, సింగిల్‌ ఇళ్లు, గుడులు, దేవాలయాలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అక్రమ మద్యం అరికట్టేలా అమ్మేవారిపైన, రవాణ చేసేవారిపైనా చర్యలు తీసుకోవాలనిన్నారు. అదృశ్యం కేసుల్లో దర్యాప్తు చేసి, తప్పిపోయిన వారిని ట్రేస్‌ చేయాలని, పెండింగ్‌ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్ట్లులో ఛార్జ్‌ షీట్లను సమర్పించి, సిసి, పిఆర్‌సి, ఎస్సి నెంబర్లు పొందాలని, నాన్‌ బెయిబుల్‌ వారెంట్లు వీలైనంత మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్‌పి ఆదేశించారు. అలాగే సైబర్‌ నేరాలపై దృష్టిసారించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 1930 టోల్‌ ఫ్రీ నెంబర్లను పబ్లిసిటీ చేయా లన్నారు.సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరిగే అవకాశాలు ఉన్నందును ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తతో విధి నిర్వహణ చేయాలని, ఇప్పటి నుండి ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సంసిద్ధం కావాలని, సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను విరివిగా సందర్శించి నిఘా పెడుతూ ముందస్తు సమాచారం సేకరించాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల పోలింగ్‌ కేంద్రాలను అధికారులు సందర్శించి, భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని, గతంలో ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలు, అతి సమస్యాత్మక గ్రామాల్లో గతంలో జరిగిన కేసుల్లో ఎవరెవరు ముద్దాయిలుగా ఉన్నారు వారిపై తీసుకుంటున్న చర్యలు గురించి ముందుగా సమాచారాన్ని సేకరించాలని ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచాలని తెలియజేసారు. సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు నిర్వహించాల న్నారు. అక్రమ మద్యం, నగదు తరలింపు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్‌ ఎన్ఫోర్స్మెంట్‌ సిబ్బంది సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో రైడ్స్‌ చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు. అనంతరంవిధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్‌పి అందజేజేశారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో పాలకొండ సిఐ ఎం.చంద్రమౌలి, ఎల్విన్‌పేట సిఐ సత్యనారాయణ, కురుపాం ఎస్‌ఐ ఎస్‌.షణ్ముఖరావు, సీతానగరం ఎస్‌ఐ రాజేష్‌, సాలూరు టౌన్‌ పిసి-608 జి.చంద్రశేఖర్‌ ఉన్నారు. ఈ నేర సమీక్ష సమావేశంలో ఎఎస్‌పి డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌, ఎఎస్‌పి సునీల్‌ షరోన్‌, డిఎస్పీలు ఎస్‌.ఆర్‌.హర్షిత, జివి కృష్ణారావు, జి.మురళీధర్‌, శేషాద్రి, ట్రైనీ డిఎస్పీ ఎస్‌ఎండి అజీజ్‌, సిఐలు సిహెచ్‌.లక్ష్మణరావు, వాసు నాయుడు, ఆర్‌ఐ శ్రీరాములు, పలువురు సిఐలు, ఎస్‌ఐలు, జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్‌ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️