అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలి

ప్రజాశక్తి-మదనపల్లి అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. గురువారం స్థానిక టిడిపి పార్లమెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా దాసరిపల్లె జయచంద్రారెడ్డిని ఖాయం చేసినట్లు స్పష్టం చేశారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు పలు రకాలుగా సర్వే నిర్వహించి జయచంద్రారెడ్డి సమర్థుడని, ఆయనే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిపై గెలవడం ఖాయమని ఆయనకే టికెట్‌ కేటా యించారన్నారు. కొంతమంది స్వార్థపరులు జయచంద్రారెడ్డికి పెద్దిరెడ్డి కుటుం బంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సోషల్‌ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. తంబళపల్లి నియోజకవర్గ టిడిపి శ్రేణులు వీటిని నమ్మవద్దని కోరారు. తంబళ్లపల్లె అభివద్ధి చేయడం, అక్కడ అరాచక పాలన పోవాలంటే జయచంద్రారెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ను చంద్రబాబు పిలిపించుకొని సముదాయించారని, పార్టీ అధికారంలోకి వస్తూనే సమచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. త్వరలో శంకర యాదవ్‌ సహకారంతో జయచంద్రారెడ్డి ప్రచారం చేసేలా చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, రాజంపేట పార్లమెంటరీ నాయకులు ఆర్జే వెంకటేష్‌, దొర స్వామి నాయుడు, ఎస్‌.ఎ.మస్తాన్‌, బిసి నాయకులు శ్రీరాములు, మాజీ సర్పంచ్‌ పటాన్‌ ఖాదర్‌ఖాన్‌, హోటల్‌ శంకర్‌, రెడ్డి ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️