అనుమతుల్లేని ఇసుక రీచ్‌లను నిలిపివేయాలి : శత్రుచర్ల

Mar 11,2024 21:13

ప్రజాశక్తి – కొమరాడ : మండలంలో ప్రభుత్వ అనుమతుల్లేకుండా నడుపుతున్న ఇసుక రీచ్‌లను నిలిపివేయాలని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరమరాజు అన్నారు. మండలంలోని రామభద్రపురం ఇసుక రీచ్‌ను మండల టిడిపి అధ్యక్షులు ఎస్‌ శేఖర్‌ పాత్రుడు ఆధ్వర్యంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి సోమవారం పరిశీలించి, అడ్డుకున్నారు. అనంతరం విజయరామరాజు మాట్లాడుతూ గతంలో ఒక ప్రైవేట్‌ కంపెనీకి ఇసుక రీచ్‌ అనుమతులు ఇచ్చినప్పటికీ అనుమతులకు మించి ఇసుకను వాడుకున్నారన్నారు. అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే రీచ్‌ను నిలిపివేశారన్నారు. ప్రస్తుతం ప్రతిమ ఇన్ఫాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చారంటూ గత వారం రోజులుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. ఇసుక రీచ్‌ వద్దకు వచ్చి అనుమతులు చూపించమని అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయాలని రీచ్‌ సంబంధిత కంపెనీ వారు చెప్పడం దారుణమన్నారు. కనీసం రీచ్‌ వద్ద అనుమతి పత్రాలు చూపించలేని పరిస్థితిలో ఇసుక అక్రమ రవాణా చేయడం అన్యాయమన్నారు. ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుంటే కేవలం అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫోన్లో స్థానిక తహశీల్దార్‌ రమేష్‌కు, ఎస్సై నీలకంఠంకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి, వారు రీచ్‌ వద్దకు వచ్చి అనుమతుల కాగితాలు ఇవ్వాలని సంబంధిత కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ విషయంపై ఇరువురు అధికారులు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సమాచారాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. తక్షణమే అనుమతులు చూపించిన తర్వాత ఇసుక తరలింపు జరగాలని అంతవరకు ఇసుక రీచ్‌ను నిలుపుదల చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఇసుక రీచ్‌ అక్రమాలపై అధికారులు పట్టించుకోరా? : సిపిఎంమండలంలో ఇసుక రీచ్‌ వద్ద జరుగుతున్న అక్రమాలపై అధికారులు పట్టించుకోరానని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండలంలోని రామభద్రపురం వద్ద ఇసుక రీచ్‌కు అనుమతుల్లేకుండా అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారని వాపోయారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకొన్న ఆయన సోమవారం స్పందనలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ఇసుక రీచ్‌ అనుమతులు ఉన్నాయా లేదా, అనుమతి లేకపోతే తక్షణమే వాహనాలు సీజ్‌ చేసి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️