అభ్యర్థుల ఎంపికపై కొలిక్కిరాని టిడిపి కసరత్తు

Feb 4,2024 00:15

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో టిడిపి తరుఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం నిర్వహిస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. వైసిపి సమన్వయకర్తల పేరుతో ప్రకటిస్తున్న అభ్యర్థుల జాబితాలను చూసి కొన్ని మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని టిడిపి నాయకులు అంటున్నారు. నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జిలకే టిక్కెట్‌లు ఇవ్వాలా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వాలా? అనే అంశంపై వివిధ సర్వే సంస్థల ద్వారా టిడిపి సర్వే చేయిస్తోంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులలో ఒకరిద్దరు పేర్లను ఖరారు చేసి వారిపై ఫోన్‌ నెట్‌వర్కు ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్‌ఛార్జి నశీర్‌ ఆహ్మద్‌తో పాటు ఆరా సంస్థ నిర్వాహకులు షేక్‌ మస్తాన్‌ అభ్యర్థిత్వంపై సర్వే చేశారు. పలు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలుగా ఉన్నవారితోపాటు కొత్త వారి పేర్లతో ఫోన్‌ సర్వే కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టిడిపి ఘోరపరాజయం చెందడంతో ఈసారి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. రాజధాని జిల్లాలో తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో ఆరేడు మందికి ఈసారి అవకాశం ఇవ్వకపోవచ్చునంటున్నారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో సీట్ల సర్ధుబాటుపై స్పష్టత రాలేదు. అయితే బిజెపితో కూడా పొత్తు ఉంటుందనే భావనతో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదని టిడిపి సీనియర్‌లు చెబుతున్నారు. పొత్తుల వ్యవహారం తేలకపోవడం టిడిపి నాయకులకు తలనొప్పిగా మారింది. వైసిపికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు టిడిపిలో చేరకుండానే నర్సరావుపేట టిక్కెటు ఖరారు చేశారన్న వార్తలు సీనియర్లలో చర్చనీయాంశంగా మారింది. ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు లోక్‌సభకు ఎంపిక చేశారన్న ప్రచారమవుతోంది. మరోవైపు వైసిపి నర్సరావుపేట లోక్‌సభకు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను, గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఖరారు చేసింది. టిడిపి రెండు లోక్‌సభ స్థానాలు ఒకే సామాజిక తరగతికి ఇవ్వాలనే ఆలోచనపై జనసేన నాయకులు కొంత మంది అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరులో కాపు నాయకులు ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి కాపులకు ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తే వారికి మా మద్ధతు ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుంటూరు లోక్‌సభ పాటు పొన్నూరు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను వైసిపి కాపులకు కేటాయించిందని, టిడిపి ఒక్కసీటు కూడా కాపులకు ఇవ్వకపోవడంపై జనసేనకు చెందిన కాపు నాయకులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ అంశాన్ని జనసేన నాయకులు పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టిడిపి సోషల్‌ ఇంజినీరింగ్‌ చేయకపోవడం వల్ల ఘోరపరాజయం చవిచూసిందని వారు గుర్తుచేస్తున్నారు. ఈసారి కూడా టిడిపిలో ఆ దిశగా అడుగులు పడటం లేదనే వాదన విన్పిస్తుంది. 1991లో గుంటూరు లోక్‌సభకు టిడిపి నుంచి లాల్‌జాన్‌బాషాను ఎంపిక చేయడం ద్వారా సీనియర్‌ నాయకుడు ఎన్‌.జి.రంగాను ఓడించగలిగామని టిడిపి సీనియర్లు గుర్తు చేస్తున్నారు. రెండులోక్‌సభ స్థానాలు ఒకే సామాజిక తరగతికి ఇవ్వడం రెండు సామాజిక తరగతులకు ఇస్తే కొత్త ఓటు బ్యాంకును ఆకర్షించడానికి అవకాశం ఉంటుందనే భావన టిడిపి సీనియర్లలో ఉంది. వైసిపికి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, మైనార్టీలను ఆకర్షించడంలో టిడిపి తగిన కసరత్తు చేయడం లేదని కానీ టిడిపి, జనసేనకు అనుకూలంగా ఉన్న కాపులను, బిసిలను ఆకర్షించడానికి వైసిపి భారీ కసరత్తుచేస్తున్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టిడిపికి చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.
(ఎ.వి.డి.శర్మ)

➡️