‘అసైన్డ్‌’ పెద్దల పరమే..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేదలకు తీరని అన్యాయం జరగనుంది. పాలకులు తీసుకున్న నిర్ణయంతో పేదలకు సెంటుభూమి కూడా లేకుండాపోనుంది. 2003కు ముందు వరకూ ఏలూరు జిల్లాలో 62 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు పేదలకు పంపిణీ చేసినట్లు అధికారులు తేల్చారు. పంపిణీ చేసిన భూముల్లో 90 శాతం ఇప్పటికే బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. తమ భూములు తమకే ఇవ్వాలంటూ అనేక ప్రాంతాల్లో పేదలు పోరాటాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని దోసపాడులో 150 ఎకరాల అసైన్డ్‌భూమికి సంబంధించి అక్కడి దళితులు ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. తమకు న్యాయం జరుగుతుందని వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. టి.నరసాపురం వంటి అనేక మండలాల్లో భూపోరాటాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు పెనుశాపంగా మారింది. పేదలంతా తమ భూములను కోల్పోనున్నారు. అదే జరిగితే పేదల జీవితాల్లో పూర్తిగా చీకట్లు కమ్ముకోనున్నాయి. అసైన్డ్‌ భూముల్లో 20 ఏళ్లు పొజిషన్‌లో ఉన్నవారు మార్కెట్‌ ధరకు మూడు రెట్లు చెల్లిస్తే వారికే రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పేదల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానిక అధికారుల సాయంతో 20 ఏళ్లు పొజిషన్‌లో ఉన్నట్లు చూపించి పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములన్నీ పెద్దలు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. దీన్ని అసైన్డ్‌ భూములు పొందిన పేదలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల ప్రకారం అసైన్డ్‌ భూమి వారసత్వంగా ఇవ్వాలే తప్ప అమ్మకాలు, విక్రయాలు చెల్లవు. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని అప్పట్లో పేదలకిచ్చిన అసైన్డ్‌ భూములను పెద్దలు తమ వశం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ భూములన్నీ పేదలకు అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం అందుకు వ్యతిరేకంగా ముందుకు సాగుతోంది. పేదల ఆర్థిక పరిస్థితిలో మార్పు రావాలంటే భూమి అనివార్యమని ఎన్నో పోరాటాలు సాగాయి. వామపక్షాలతో సహా ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగానే పేదలకు అప్పట్లో ప్రభుత్వాలు భూపంపిణీ చేశాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ పేదలకు భూమి అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. భూమి మొత్తం కొద్దిమంది చేతుల్లోకే వెళ్లిపోనుంది. గతంలో పంపిణీ చేసిన వేలాది ఎకరాల భూములను బడాబాబులకు కట్టబెట్టి.. ఇప్పుడు ఏదో తూతూమంత్రంగా భూపంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏలూరు జిల్లాలో ఇటీవల 752 మందికి 693.25 ఎకరాలకు సంబంధించి పట్టాలిచ్చే కార్యక్రమం చేపట్టారు. గతంలో పంపిణీ చేసిన భూములను బడాబాబులకు ధారాదత్తం చేయాలనుకోవడం అత్యంత దారుణమనే విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వేలాది మంది పేదలకు పెనుశాపంగా మారిన పరిస్థితి ఉంది. అసైన్డ్‌ భూములను అసలైన పేదలకు అప్పగించాలని అంతా కోరుతున్నారు. అప్పుడే పేదలకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది.

➡️