ఆంధ్రా ప్యారిస్‌లో హైదరాబాద్‌ తరహాలో ‘తెనాలి బండ్‌’

Mar 18,2024 00:14

తెనాలి బండ్‌పై ఏర్పాటైన విగ్రహాలు
ప్రజాశక్తి-తెనాలి :
ఆంధ్రా ప్యారిస్‌ సుందరీకరణలో మరో అడుగు ముందుకు పడింది. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో ‘తెనాలి బండ్‌’ తుది మెరుగులు దిద్దుకుంటుంది. తెనాలి ప్రాంత రాజకీయ ప్రముఖులు, కవులు, కళాకారుల విగ్రహాల ఏర్పాటుకు సిద్ధమవుతున్న తెనాలి బండ్‌పై ఇప్పటికే కొందరి విగ్రహాలు కొలువుదీరాయి. తాజాగా ప్రముఖ సినీ రచయిత మోదుకూరి జాన్సన్‌ విగ్రహాన్నీ ఏర్పాటు చేయగా త్వరలో ఆవిష్కరించనున్నారు.ఎంతో చైతన్యవంతమైన తెనాలి ప్రాంతం రాజకీయం, విద్య, వైద్యం, క్రీడా రంగాలతో పాటు కవులు, కళాకారులకు నిలయం. అన్నిరంగాల్లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న తెనాలిలో హైదరాబాద్‌ తరహా ‘తెనాలి బండ్‌’ ఏర్పాటు చేపట్టారు. తెనాలి-విజయవాడ మెయిన్‌ రోడ్డులోని బస్టాండ్‌ నుంచి ఆటోనగర్‌ వరకూ గల నాలుగులైన్ల రోడ్డు ఎడమవైపు మార్జిన్‌ ఫుట్‌పాత్‌ను తెనాలి బండ్‌కు ఎంపిక చేశారు. తెనాలి ప్రాంత కీర్తిని దేశ నలుదిశలూ చాటిన మహనీయుల విగ్రహాలను ‘తెనాలి బండ్‌’పై ఏర్పాటు చేయాలని భావించి తెనాలి బండ్‌ నిర్మాణం, దానిపై ఏర్పాటు చేయాల్సిన విగ్రహాలపై ఓ కమిటీని వేశారు. పురపాలక సంఘం 14వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ నిధులతో 2021 డిసెబంర్‌ 10న తెనాలి బండ్‌కు శంకుస్థాపన చేశారు. అయితే వివిధ కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యమైనా ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. విగ్రహాల ఏర్పాటుకు ఫుట్‌పాత్‌, దిమ్మెల నిర్మాణం పూర్తయింది. మార్బుల్‌, గ్రానైట్‌తో దిమ్మెలకు సొబగులద్దారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని నటరాజ్‌ జ్యూయలర్స్‌ అధినేత కొత్తమాసు కుమార్‌, విజయభాస్కర్‌ ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. బిజెపి నాయకులు తమిరిశ రామాచార్యులు విగ్రహాన్ని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్యే కలిసి ఆవిష్కరించారు. ప్రముఖ సినీనటులు గుమ్మడి వెంకటేశ్వరరావు విగ్రహాన్ని, వేద సంస్కృత పాఠశాలను ఏర్పాటు చేసిన పండిత యలవర్తి ఆంజనేయశాస్త్రి విగ్రహావిష్కరణలు పూర్తయ్యాయి.తెనాలి బండ్‌కు చేరిన మోదుకూరి జాన్సన్‌ విగ్రహంమండలంలోని కొలకలూరుకు చెందిన ప్రముఖ సినీ, నాటక రచయిత, సినీ నటులు మోదుకూరి జాన్సన్‌ కాంస్య విగ్రహం తెనాలి బండ్‌కు చేరింది. గ్రామానికి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పొన్నెకంటి జోసఫ్‌ రత్నాకర్‌ సారధ్యంలో జాన్సన్‌ కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన విద్యావేత్తలు, మేథావులు, అభిమానులు సమిష్టిగా ఏర్పాటు చేసిన జాన్సన్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలోనే విగ్రహావిష్కరణ ఉంటుందని డాక్టర్‌ జోసఫ్‌ రత్నాకర్‌ చెప్పారు. విద్యుద్ధీపాలంకరణ, మొక్కల పెంపకం, పురపాలక సంఘం నిత్య పర్యవేక్షణలో సందర్శకులను ఆకర్షించే రీతిలో రూపుదిద్దుకుంటున్న తెనాలి బండ్‌ ఈ ప్రాంత వైభవానికి చిహ్నంగా నిలవనుంది.

➡️