ఆదివాసీల అభివృద్ధికి ఆర్ట్స్‌ సుస్థిర సేద్యం

Feb 7,2024 22:08

ఏజెన్సీ ప్రాంతాల్లో సుస్థిర సాగుకు 30 సంవత్సరాలుగా సహకారం అందిస్తోంది… ఆర్ట్స్‌ సంస్థ. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల అభివృద్ధిలో భాగస్వామ్యమౌతోంది. సాగునీటి వనరుల సంరక్షణ కోసం వాటర్‌షెడ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నేల కోతను తగ్గించడం, పంటలకు ఉత్పత్తిని పెంచడం, సహజ పద్ధతుల నుంచి సేంద్రియ పంటలు పండించడం, రైతుల జీవనోపాధులు మెరుగు పరచడం.. ఇలా అనేక రకాలుగా గిరిజనానికి మార్గనిర్దేశం చేస్తూ, అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తోంది.

ప్రజాశక్తి-సీతంపేట: ఆదివాసీల ఆర్థికాభివృద్ధే లక్ష్యంతో 1993లో నూక సన్యాసరావు అనేక వ్యక్తి ఆర్ట్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయనే డైరెక్టర్‌గా ఉంటూ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఆదివాసీ ప్రాంతాల్లో భూమి అభివృద్ధి కార్యక్రమం చేపట్టి వాటి ద్వారా పంటలు పండించే ప్రయత్నాలు చేశారు. వన సంరక్షణ సమితులు ఏర్పాటుచేసి అటవీ సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా సహజ వనరులు అభివృద్ధి చెందితే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఆర్ట్‌ సంస్థ ద్వారా సీతంపేట ఏజెన్సీలో వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలు నిర్వహించారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు అభివృద్ధి చెందడానికి మండలంలో కుసిమి, పెద్దూరు, మండ, గోయిది, సిలగాం, హడ్డుబంగి, సొమగండి, సీతంపేట, కోసంగి, సామరెల్లి, తదితర పంచాయతీల్లో చెక్‌డ్యాములు, రాతికట్లు, కందకాలను ఏర్పాటు చేశారు. నేల కోతను నివారించి, రెండు పంటలు పండే విధంగా భూమిని తయారు చేశారు. సమీకృత వ్యవసాయ విధానం ద్వారా వ్యవసాయ పంటలు, చిరుధాన్యాలు సాగుచేశారు. ఉద్యాన పంటలు జీడి, పైనాపిల్‌, పసుపు వంటి పంటలు అభివృద్ధి చేయడానికి ఆర్ట్స్‌ సంస్థ సహకారం అందించింది. నాటు కోళ్లు పెంపకం ద్వారా అదనపు ఆదాయాలు చేకూర్చింది. 52 చెరువులు తవ్వించి చేపల పెంపకం కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కొక్క రైతుకు రూ.25 వేలు నుంచి రూ.50 వేల వరకు అదనపు ఆదాయం వచ్చే విధంగా కృషి చేసింది. నాబార్డు సహకారంతో సహజ వనరులను అభివృద్ధి చేసి, రెండు పంటలు పండించి సమీకృత వ్యవసాయ విధానం ద్వారా సుస్థిరమైన అభివృద్ధిని రైతులకు అందిస్తోంది. ఐటిడిఎ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సహకారంతో ప్రకృతి రక్షణతో పాటు రైతుల ఆదాయాలు పెంపొందించేలా కృషి చేస్తోంది. ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆర్ట్స్‌ సంస్థ ఆదివాసీలకు అండగా నిలుస్తోంది. అందరి మన్ననలు అందుకుంటోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు, అవార్డులు పొందుతోంది. చేపల పెంపకంతో మంచి ఆదాయం ఆర్ట్స్‌ సంస్థ వాటర్‌ షెడ్‌ పనులు నిర్వహించడం వల్ల నీటి వసతి ఉంటోంది. దీనివల్ల చేపల పెంపకం, కూరగాయల పంటలు పండిస్తుంది. చేపల పెంపకం వల్ల మంచి ఆదాయం లభిస్తోంది. ఏడాదికి రూ.50 వేల వరకు ఆదాయం వస్తోంది.- కె.గౌరమ్మ, రైతు, చిన్న రామచెరువుల తవ్వకంతో రెండు పంటలుఆర్ట్స్‌ సంస్థ ఏజెన్సీలో చెరువులు తవ్వించడం వల్ల ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాం. చెరువులో చేపల పెంపకం వల్ల అదనపు ఆదాయాలు వస్తున్నాయి. పంటల సాగుకు అవలంబించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. 30 సంవత్సరాలుగా మాకు సహాయం అందిస్తున్నారు.- బి.పార్వతమ్మ, రైతు, చిన్నరామజీవనోపాధులు పెంపొందించడం లక్ష్యం ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలకు జీవనోపాధులు పెంపొందించడమే ఆర్ట్స్‌ సంస్థ లక్ష్యం. నాబార్డు సహకారంతో 30 సంవత్సరాలుగా గిరిజనులకు ఆర్ట్స్‌ సంస్థ ఆర్థిక స్వావలంబన అందిస్తోంది. సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించి రైతులకు మేలు చేయడానికి నావంతు కృషి చేస్తున్నాను. వాటర్‌ షెడ్‌ కార్యక్రమాలు నిర్వహించి నీటి కొరత లేకుండా చూస్తున్నాం.- నూక సన్యాసిరావు, ఆర్ట్స్‌ సంస్థ డైరెక్టర్‌

➡️