ఉపాధి కల్పన చేపట్టాలి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కరువు నివారణ, ఉపాధి కల్పన చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని బి మాచవరం గ్రామంలో శుక్రవారం సంతకాల సేకరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తుపాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని, పనులు కోల్పోయిన వ్యవసాయ కార్మికులకు ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను తగ్గించి పేదలను వలసబాట పట్టే విధంగా చేస్తూ ఉపాధిని కూడా లేకుండా చేసే విధంగా చర్యలను తీసుకుంటున్న దని, దాని మూలంగా పేదలకు జీవనస్థాయి తగ్గిపోతుందని తెలిపారు. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉపాధి కూలి రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు పెంచాలని కోరుతూ అర్జీని మద్దులూరు సచివాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు అన్నవరపు శేషారావు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

➡️