ఉపాధి హామీ సిబ్బంది నిరసన

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండల ఉపాధి హామీ సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ సిబ్బంది వున్న సంగతే మర్చిపోయిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 యేళ్లు పూర్తవుతున్నప్పటికీ తమకు జీతాలు పెంచలేదని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువులను దృష్టిలో వుంచుకొని అయినా పెంచాలా లేదా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టం ద్వారా వస్తున్న నిధులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆ ఉపాధి సిబ్బంది సంక్షేమాన్ని మరచిపోవడం అన్యాయమని విమర్శించారు. జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి వస్తే తప్పక జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని, అలాగే ఎన్నిక మేనిఫెస్టోలో కూడా ఉపాధి హామీ సిబ్బందికి న్యాయం చేస్తానని నమ్మబలికి చివరికి మొండి చెయ్యి చూపించడం నమ్మించి మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి ఉపాధి హామీ సిబ్బందిని ఉపయోగించి ఇప్పుడు ఇలా చేయడం న్యాయం కాదని అన్నారు. గత ప్రభుత్వంలో రెండుమార్లు తమ జీతాలను పెంచారని, ఈ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమ న్యాయమైన డిమాండ్‌ తీర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఓ సుజాత, ఈసి వెంకటేశ్వరరెడ్డి, టిఏ శ్రీను, పోలయ్య, రమేష్‌, సిఓ బాలు, ఎఫ్‌ఏ రవిరెడ్డి, సింగిరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️