ఊరి తాళ్ళు మెడకు కట్టుకొని అంగన్వాడీల నిరసన

Dec 28,2023 15:44 #Anganwadi strike, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరంలో అంగన్వాడీలు మెడకు ఉరి తాళ్ళు బిగించుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెలపర్స్‌ యునియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు మాట్లాడుతూ.. 17 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడటం సరైంది కాదన్నారు.ప్రభుత్వం ఎంత బెదిరిస్తే ఉద్యమం అంతే స్థాయిలో ఉదతం చేస్తామని హెచ్చరించారు. శిబిరంలో అంగన్వాడీ లు సమస్యలు పరిష్కారం చేయాలని కనీస వేతనాలు అమలు చేయాలని,గ్రాట్యుటీ చెల్లించాలని , మెనూ చార్జీలు పెంచాలని పెద్ద ఎత్తున నినదించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి వి.రమణ, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

➡️