ఎంసిసిని పకడ్బందీగా అమలు చేయాలి

ప్రజాశక్తి-రాయచోటి ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్‌ అభిషిక్తి కిషోర్‌ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్పరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌, తహశీల్దార్‌లు, ఎంపిడిఒలతో ఎంసిసి నిబంధనలపై విసి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కుల, మత, ప్రాంతీయపరమైన విద్వేషాలు చేయడం, రెచ్చగొట్టేలా రాజకీయనేతలు ప్రవర్తించడం, మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయడం, వంటివి చేయకూడదన్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు కట్టడం, లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేయడం, డబ్బులు పంపిణీ చేయడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం, వంటివి నిషిద్ధమన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎంసిసి వైలేషన్స్‌ జరిగినట్లు తమ దష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో రాజకీయ పార్టీలకు సంబంధించి బ్యానర్లు పెక్సీలు కటౌట్స్‌ ఉంటే తొలగిం చాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలలో హోర్డింగులు ఉండకూడదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు ఆర్పీలు, వాలంటీర్లు రాజకీయ పార్టీ నాయకుల వెంట ర్యాలీలలో, ప్రచార కార్యక్రమాలలో పాల్గొనకుండా చూడాలని, ఎవ్వరైనా పాల్గొంటే వారిని వెంటనే సస్పెండ్‌ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మోడల్‌ కోడ్‌ అమల్లో ఉన్నందున ఎలక్షన్‌ రిలేటెడ్‌ అంశాలన్నీ పక్కాగా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఆర్‌ఒలు పాల్గొన్నారు.

➡️