ఎజెఎసి మేనిఫెస్టో అమలు చేసే పార్టీకే మద్దతు

Jan 7,2024 21:55

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో ఆదివాసీ జెఎసి సూచించిన మేనిఫెస్టో అమలుకు హామీ ఇచ్చిన పార్టీకే మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు జిల్లా ఎజెఎసి వైస్‌ చైర్మన్‌ కొండగొర్రి ఉదరు కుమార్‌ చెప్పారు. ఆదివారం మక్కువ మండలం వైఎస్‌వలసలో ఎజెఎసి సమావేశం నిర్వహించారు. పనసభద్ర సర్పంచ్‌ చోడిపిల్ది నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదరు కుమార్‌ మాట్లాడుతూ అవసరమైతే రానున్న ఎన్నికల్లో ఎజెఎసి తరపున కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులను బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. గ్రామ, మండల స్థాయిలో ఎజెఎసి బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పని చేయకూడదని తీర్మానించామని తెలిపారు. షెడ్యూల్డ్‌ ఏరియాకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 244(1) కి అనుగుణంగా షెడ్యూల్‌ ఏరియాలో పరిపాలన సాగాలన్నారు. పీసా చట్టాన్ని అమలు చేయాలని, అటవీ హక్కుల సంరక్షణ చట్టం 2023 నియంత్రణ, ఎల్టిఆర్‌ చట్టాలపై అవగాహన వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మాజీ ఎంపి కొత్తపల్లి గీత ఎస్‌టి కాదంటూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని అన్నారు. సమావేశంలో మక్కువ మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా ఒ.మోహనరావు, ఉపాధ్యక్షుడిగా ఎస్‌.నూకరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.పోలిరాజు, సహా కార్యదర్శిగా ఎం.జోగిరాజు, కోశాధికారిగా సిహిచ్‌.వాసు, సహ కోశాధికారిగా ఆర్‌.అరవింద్‌, మహిళా అధ్యక్షురాలిగా కె.ఆదిలక్ష్మీ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎజెఎసి ముఖ్య సలహాదారు ఆరిక నీలకంఠం, స్థానిక నాయకులు రాయల విజరు కుమార్‌, కె.సోమయ్య, రాయల అనిరుధ్‌ పాల్గొన్నారు.

➡️