ఎన్నికలకు సిద్ధంకండి

Feb 21,2024 21:25

ప్రజాశక్తి-మక్కువ : కొద్ది రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు వాలంటీర్లంతా సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రజలను కూడా సిద్ధం చేయాలని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర వాలంటీర్లకు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వాలంటీర్లకు సేవా సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలకు వైసిపి హయాంలో మేలు జరిగిందని తెలిపారు. అందుకే లబ్ధి పొందితేనే ఓటు వేయాలని సిఎం జగన్మోహన్‌ రెడ్డి గట్టిగా అడుగుతున్నారని తెలిపారు. ఎన్నికల్లో వాలంటీర్లంతా సైనికుల్లా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. వాలంటీర్ల సేవలకు ఇచ్చే ప్రోత్సాహకాలు ఎంత చెప్పుకున్నా తక్కువేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మండలంలో 346 మంది వాలంటీర్లకు సుమారు 56 లక్షలకు పైచిలుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌టిఆర్‌ పేరును చంద్రబాబు ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకుని తరువాత పక్కన పడేస్తారని రాజన్నదొర విమర్శించారు. ఎన్‌టిఆర్‌ బొమ్మ పెట్టుకుని మాత్రమే పార్టీని నడపగలరని, ప్రజలకు ఏమి చేశారని చెప్పుకొని మాత్రం కాదని తెలిపారు. టిడిపి హయాంలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీలేదని విమర్శించారు. ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. అనంతరం వాలంటీర్లకు పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఎం.శ్రీనివాసరావు, వైసిపి నాయకులు రంగు నాయుడు, ఎంపిపి ఎం.పారమ్మ, ఎంపిడిఒ దేవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️