ఎమ్మెల్యేలంతా ఇసుక, భూదందాలే

Feb 16,2024 21:08

 ప్రజాశక్తి – విజయనగరం కోట, నెల్లిమర్ల, గంట్యాడ  : విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు జిల్లాలో ఇసుక, భూ దందాలకు పాల్పడుతున్నారని, ఎదురు తిరిగిన ప్రజలపైనా, టిడిపి కార్యకర్తలపైనా అక్రమ కేసులు, ఆపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల మరో అడుగు ముందుకు వేసి భూదందాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుతో చేతులు కలిపి విజయనగరాన్ని గంజాయికి అడ్డాగా మార్చేశారని విమర్శించారు. అధికారంలోకి రాగానే వైసిపి నాయులు దోచుకున్నదంతా కక్కిస్తానని, ప్రజలను, టిడిపి కార్యకర్తలను వేధింపులకు పాల్పడిన వైసిపి నాయకుల భరతం పడతానని హెచ్చరించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని రామతీర్థం, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడలో శుక్రవారం నిర్వహించిన శంఖారావం సభల్లో ఆయన మాట్లాడారు. సిఎం జగన్‌ అధికారంలోకి రాక ముందు విజయనగరం జిల్లాకు 50 హామీలు ఇచ్చినా వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌ పోర్ట్‌, రామతీర్థసాగర్‌ ప్రాజెక్టు, పెద్దగెడ్డ పూర్తి, గోస్తాని – చంపావతి నదుల అనుసంధానం, స్వర్ణముఖి – చిట్టిగడ్డపై బ్రిడ్జి ఆచరణకు నోచుకోలేదన్నారు. టిడిపి ప్రభుత్వంలో విజయనగరం జిల్లాలో అత్యధికంగా రోడ్లు, భవనాలు, ఆసుపత్రు అభివృద్ధి, టూరిజం ప్రాజెక్టులు, సాగు-తాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. వైసిపి హయాంలోనే రాముడి విగ్రహం తలనరికివేతకు గురైందని, ఈనేపథ్యంలో రామతీర్థం వచ్చిన చంద్రబాబును లారీలతో అడ్డుకున్నారని గుర్తుచేశారు. టీడీపీ తరపున పోరాడినందుకు స్థానిక కార్యకర్త సూరిబాబును సాక్షాత్తు సీఐ, డీఎస్పీ చితకబాదారని అన్నారు. ఇలా ఇబ్బందులు పెట్టిన అధికారులు, వైసిపి నాయకులను విడిచిపెట్టేది లేదన్నారు. సిఎం జగన్‌ అవినీతికేసులో కేసు ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ గజపతిరాజును అవమానిస్తూ, ఆయనకు చెందిన మాన్సాస్‌ ట్రస్టును లాగేసుకునేందుకు ప్రయత్నించారని అన్నారు. అధికారంలోకి రాగానే ‘అశోక్‌ జగపతిరాజుతో పెట్టుకున్నానా అని భయపడేలా చేస్తాను అని లోకేష్‌ అన్నారు. ఎమ్మెల్యే వీరభద్రస్వామి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా విజయనగరాన్ని మార్చారని అన్నారు. ప్రభుత్వ భూములు లాక్కుని పార్టీ కార్యాలయం కట్టుకున్నారన్నారు. ఎకరా రూ.15 లక్షలకు కొనుగోలు చేసి, ప్రజలకు ప్రభుత్వం తరపున ఇచ్చే సెంటు పట్టాల కోసం రూ.38 లక్షలకు విక్రయించిన ఘనత స్వామిదేనన్నారు. ఇటువంటి దందాలపై నిలదీసిన టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నాడని అన్నారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఆయన కొడుకు మణిదీప్‌ నియోజకవర్గం లోని ఇసుక, ఇతర గనులను కాజేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల భూములు కూడా వారి పేర్లపై ట్రాన్స్‌ ఫర్‌ చేసుకుంటున్నారన్నారు. టిడిపి-జనసేన ప్రభుత్వం అధికారంలోకి గానే చింతపల్లిలో తలపెట్టిన జెట్టీని నిర్మిస్తామన్నారు. తారకరామతీర్థసాగర్‌, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని, మూతపడిన జూట్‌ మిల్లులను తెరిపిస్తామని, పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను వంద రోజుల్లో పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేలంతా ఇసుక, భూదందాలే

ఆయన్ని చూసి ఓటు వెయ్యాలట

కోలగట్లపై అశోక్‌ వ్యన్యస్త్రాలు

‘విజయనగరంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వైసిపిని చూసి కాకుండా తనను చూసి ఓటేయాలని కోరుతున్నాడు ఇక్కడి ఎమ్మెల్యే’ అంటూ కోలగట్ల వీరభద్రస్వామిపై టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు వ్యన్యస్త్రాలు కురిపించారు. ‘ఎమ్మెల్యే అంతరార్థం ఏమిటో నాకు అర్థం కాలేదు’ అంటూ చురకలంటించారు. పరిస్థితి ఇలా ఉంటే ఊరినిండా ఫ్లెక్సీలు వేసుకోవడం ఎందుకని, ఏం అభివద్ధి చేశారని తిరిగి వైసిపికి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఆడుదాం ఆంధ్రా అంటూ సిఎం జగన్‌ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే…. స్థానిక ఎమ్మెల్యే జలాశనాలు వేసింది చాలదన్నట్టు నగరమంతా ఫెక్సీలతో నింపేశారని, అది ఎవరికి పనికొచ్చిన పని అని అన్నారు. దీన్నిబట్టి ఎమ్మెల్యేగానీ, ఆ పార్టీకి చెందిన మంత్రులు, పెద్దల ప్రాధాన్యతలు ప్రజలు గుర్తించాలన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్రంలో ఆరున్నర లక్షలమంది పిల్లలను బడికి దూరమయ్యారని అన్నారు. మరోసారి ఈ ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తే దేశంలోనే అత్యధిక నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా ఎపిని మారుస్తారని విమర్శించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతి మాట్లాడుతూ నగరాన్ని వైసిపి నాయకులు దోచుకుంటున్నారని అన్నారు. విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పుస్తకాలు, ఇతర వస్తుసామగ్రిలోనూ భారీ అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. గంట్యాడలో గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు మాట్లాడుతూ ఆధునీకరణ పేరుతో మూసివేసిన భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పనర్సయ్య దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పేదలు, ప్రభుత్వానికి చెందిన సుమారు 500 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని అన్నారు. వాటిని కాపాడుకునేందుకు తాజాగా ఉత్తరాంధ్ర సులస్రవంతి కాలువ అలైన్‌మెంట్‌ కూడా ఇష్టారాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లిమర్లలో నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ వైసిపి వైఖరివల్ల తామతీర్థసాగర్‌ ప్రాజెక్టు కలనెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు సాగునీరు లేక, మరోవైపు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పొట్టకూటికోసం వలసలు పోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. ఎయిర్‌పోర్టు, రామతీర్థసాగర్‌ నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం, పునరావాసం పూర్తిస్థాయిలో అందలేదన్నారు. ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి : జనసేన రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జనసేన జిల్లా ఇన్‌ఛార్జి లోకం మాధవి, విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పాలవలస శయశ్విని, మర్రాపు సురేష్‌ అన్నారు. వైసిపి ప్రభుత్వ పెద్దలు పంచభూతాలను మింగేస్తూ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. సభల్లో పలువురు టిడిపి , జనసేన నాయకులు వినతులు వెల్లువ నారా లోకేష్‌కు పలువురు తమ సమస్యలపై వినతులు ఇచ్చారు. పోలవరం ప్రధాన కాలువ ఎలైన్‌మెంట్‌ మార్పుతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాన్ని రీ డిజైన్‌ చేయాలని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూ బాధితులు కోరారు. పూర్తిస్థాయిలో డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేసేలా చూడాలని డిఎస్‌సి అభ్యర్థులు వినతులిచ్చారు.

➡️