ఎల్‌ఇడి బల్బుల విద్యుత్‌ ఛార్జీలు చెల్లించేది లేదు

ఇఒపిఆర్‌డికి వినతిపత్రం ఇస్తున్న సర్పంచ్‌లు

తీర్మానించిన మండల సర్పంచ్‌ల సంఘం

ప్రజాశక్తి -మునగపాక

గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడి బల్బుల విద్యుత్‌ ఛార్జీల బిల్లులు చెల్లించేది లేదని మండల సర్పంచుల సంఘం స్పష్టం చేసింది. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం జరిగిన మండల సర్పంచ్‌లో సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ 2013లో నాడు గ్రామపంచాయతీలలో ఎల్‌ఈడి బల్బులు ఏర్పాటు చేశారని, వాటి విద్యుత్‌ బిల్లులు 2018 వరకు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని 2021లో సర్పంచ్‌లుగా ఎన్నికైన తమను చెల్లించమని ఆదేశించడం సరికాదని పేర్కొన్నారు. ఎల్‌ఈడీ బల్బులు ఎక్కడ ఉన్నాయి? వాటి నిర్వహణ బాధ్యతలు ఎవరు చూసుకుంటున్నారు? అనేది తమకు ఇంత వరకు తెలియపరచలేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో విద్యుత్‌ బిల్లులు బకాయిలు చెల్లించలేదమని స్పష్టం చేశారు. అనంతరం ఇఒపిఆర్‌డి వెంకటలక్ష్మికి బిల్లులు చెల్లింపు నిరాకరణతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు దిమ్మల అప్పారావు, కాండ్రేగుల నూకరాజు, భీమిశెట్టి మంగలక్ష్మి కృష్ణారావు, బీసెట్టి గంగ అప్పలనాయుడు, దాసర అప్పారావు, బొడ్డేటి శ్రీనివాసరావు, జి సూరప్పారావు, చదరం గణేష్‌ నాయుడు, సుందరపు నీలకంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️