కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

కలెక్టరేట్‌ ఎదుట మున్సిపల్‌ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ తిరుపతి జిలా ్లకలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమవారం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపల్‌ కార్మికులు భారీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు జి.బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ మునిసిపల్‌ కార్మికులు గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మూడుసార్లు చర్చలు జరిపినప్పటికీ, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోలేదని తెలిపారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోగా మరో మూడు సంవత్సరాల వరకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచడం జరగదని నిర్ధాక్షణ్యంగా చెప్పడం దారుణమని, ఇది పొమ్మనలేక పొగ పెట్టటమేనని అన్నారు. ప్రభుత్వ తీరు మునిసిపల్‌ కార్మికులను అవమానపరిచే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కారించక పోగా రెచ్చగొట్టే ధోరణిని అనుసరించడం తగదన్నారు. న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయకపోగా, రౌడీలను, గూండాలను కార్మికులపై దాడులకు ఉసి గొల్పుతున్నారని, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ప్రత్యక్షంగా మునిసిపల్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు పోలీసులను అడ్డం పెట్టుకొని దాడులు చేయడం అమానుషమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌, 11వ పిఆర్‌సి ప్రకారం జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు మద్దతు తెలుపుతున్న సిఐటియు నాయకులపై బైండ్‌ ఓవర్‌ కేసులుపెట్టడం సరికాదన్నారు. జిల్లా శ్రామిక మహిళా కన్వీనర్‌ ఆర్‌.లక్ష్మి, సిఐటియు జిల్లాకార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం, యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపి, పద్మనాభం, వడ్డిపల్లి చెంగయ్య, చాపల వెంకటేశ్వర్లు, సుబ్బన్న, లక్ష్మి, ప్రభావతి, ప్రసాద్‌ పాల్గొన్నారు. గూడూరు టౌన్‌: గూడూరులో మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె సోమవారానికి 14 రోజులకు చేరుకుంది. సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి.రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే అంతవరకు సమ్మెను విరమించబోమని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నాయకులు జోగి శివకుమార్‌, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బి.రమేష్‌, దారా కోటేశ్వరరావు, బి.మురళి, బి.పెంచల ప్రసాద్‌, శ్రామిక మహిళా కార్యదర్శి సంపూర్ణమ్మ పాల్గొన్నారు.

➡️