కలెక్టరేట్‌ వద్ద ఎపి రైతు సంఘం ధర్నా

Jan 8,2024 22:02

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ ధాన్యం కొనుగోలులో అక్రమాలను నిరోధించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యాన రైతులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లాఅధ్యక్ష, కార్యదర్శులు ఎం.గోపాలం, బుద్దరాజు రాంబాబు మాట్లాడుతూ మిల్లర్ల దోపిడీ, అక్రమాలు, కొంతమంది క్షేత్ర స్థాయి అధికారుల అలసత్వం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని అన్నారు. ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా ఆచరణలో ఆర్‌బికెలలో గాని, రైతు కల్లాలు వద్ద గాని తూకం జరగడం లేదన్నారు. రైతుల వద్ద మిల్లర్లు క్వింటాకు పది కేజీలు వరకు అందనంగా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఒక క్వింటా వద్ద రూ.200 వరకు నష్టపోతున్నారని తెలిపారు. ఆర్‌బికె లోనే ధాన్యం కొనుగోలు నిబంధన టెస్టులు చేసి టెస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం ధాన్యం మిల్లరుకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారుర. ఈ-క్రాప్‌ లేని వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి నేరుగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎల్‌.అధినారాయణ మూర్తి, సిరికి శ్రీరామ్మూర్తి, ఈదుబిల్లి అప్పారావు, చంద్రరావు, కృష్ణనాయుడు రైతులు పాల్గొన్నారు

➡️