కార్మికుల సమస్యలను పరిష్కారించండి

  •  కమిషనర్‌కి సిఐటియు వినతి

ప్రజాశక్తి-చిత్తూరు : చిత్తూరు కార్పొరేషన్‌లో ఉన్న ఉద్యోగులు, ఔట్సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నూతన కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్‌ను కలిసి సమస్యలపై నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్‌, మాట్లాడుతూ.. పర్మినెంట్‌ ఉద్యోగులను ఇప్పటివరకు రెగ్యులరైజ్‌ చేయలేదని వెంటనే చేయాలని ప్రభుత్వానికి సిఫార్సులు పంపాలని, పిఎఫ్‌ ఖాతాలను జిపిఎఫ్‌ ఖాతాలగా మార్చాలని కోరారు. 6, 12, 18 ,24 సంవత్సరాలకు స్పెషల్‌ గ్రేడ్‌ ఇంక్రిమెంట్స్‌ ఇవ్వాలని, ఔట్సోర్సింగ్‌ కార్మికులకు పిఎఫ్‌ ప్రస్తుత ఆధార్‌ కార్డు అనుగుణంగా ఆప్కాస్‌ పీఎఫ్‌ ఖాతాలు మార్చాలని కోరారు. 60 సంవత్సరాల రిటైర్డ్‌ అయిన ఔట్సోర్సింగ్‌ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. మొన్న జరిగిన సమ్మెలో ఒప్పందం ప్రకారం సంక్రాంతి కానుక వేయి రూపాయలు రాష్ట్రమంతా ఇచ్చిన చిత్తూరు కార్పొరేషన్‌లో ఇప్పటివరకు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అవుట్సోర్సింగ్‌ కార్మికులు డ్డ్రైవర్లుగా పని చేయించుకుంటూ కార్మికుల జీతాలు ఇవ్వడం సరైంది కాదని జీవో ప్రకారం డ్రైవర్ల వేతనం ఇవ్వాలని కోరారు. చిత్తూరు నగర ప్రజలకు సేవలు అందించడానికి రకరకాల పద్ధతుల్లో పనిచేస్తున్న కార్మికులు పనిచేయడానికి పనిముట్లు రెండు సంవత్సరాలుగా ఇవ్వకపోవడం సరైనది కాదని చీపుర్లు, గంపలు, యూనిఫాం, కొబ్బరినూనె, చెప్పులు వంటివి వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల పై కమీషనర్‌ స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను పరిష్కారం చేయడానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, ఎస్‌ బాబు, దొరసామి, లోకనాథం, వరలక్ష్మి ,రాణి, ఈశ్వరరావు, భూపతి తదితరులు పాల్గొన్నారు.

➡️