కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సిపిఎం

ప్రజాశక్తి- శింగరాయకొండ : అంగన్‌వాడీ, మున్సిపల్‌ కార్మికులు, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి. కొండారెడ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక దాచూరి రామిరెడ్డి అనసూర్యమ్మ యుటిఎఫ్‌, సిఐటియు కార్యాలయంలో సిపిఎం నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్‌వాడీలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలను మున్సిపల్‌ మంత్రి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఆందోళన కూడా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకూ రైతులకు నష్టపరిహారం అందలేదని ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని నష్టపరిహారం అందజేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టంగుటూరి రాము, కెజి. మస్తాన్‌, వేసుపోగు మోజెస్‌, గడ్డం వందనం, టి.రామ్మూర్తి, ప్రేముల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

➡️