కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ మూత..!

Jan 27,2024 21:37
మీడియాతో మాట్లాడుతోన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

మీడియాతో మాట్లాడుతోన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ మూత..!
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను నెలాఖరకు మూత వేస్తున్నట్లు మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక వేణుగోపాల స్వామి కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పోర్టు యాజమాన్యం ఈ నెలాఖరకు కంటైనర్‌ టెర్మినల్‌ను మూసివేస్తున్నట్లు లేఖ రాశారన్నారు. చివరిగా కంటైనర్‌ నౌక రానున్నదన్నారు. తమిళనాడుకు ఈ టెర్మినల్‌ను తరలిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ కాకాణి గోవర్దన్‌రెడ్డి బెదిరింపులు, అక్రమ సంపాదన కారణంగానే ఇక్కడ నుంచి టెర్మినల్‌ తరలిపోతుందన్నారు. కృష్ణపట్నం పోర్టుకు ఇప్పటికే 2500 ఎకరాలు రైతులు భూము లిచ్చారని, మరో 6 వేల ఎకరాలు పరిశ్రమల నిర్మాణం కోసం స్వీకరించారన్నారు. కిసాన్‌ సెజ్‌ పేరుతో 2500 ఎకరాలు స్వీరించారన్నారు. సుమారు పది వేల ఎకరాలు పోర్టు ఆధారంగా వచ్చాయని పోర్టు లేకపోతే ఈ భూములు వృథా అవుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పథకం ప్రకారం పోర్టును నిర్వీర్యం చేస్తుందన్నారు. టిడిపి, సిపిఎం, సిపిఐ, జనసేన, బిజెపి ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని పోరాటం సాగిస్తామన్నారు. మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి పోర్టులోని టెర్మినల్‌ ఎక్కడకు వెళ్లదని చెబుతున్నారని, ఇందులో ఏమాత్రమూ వాస్తవం లేదన్నారు. సుమారు 10 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతు న్నారన్నారు. ఇక్కడకు కంటైనర్లు రావడం దాదాపు నిలిచిపోయా యన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనీసం నోరు మెదపడం లేదన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కృష్ణపట్నంకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మాజీ రైల్వే పిఆర్‌ఒ పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టుకు ఆధారంగా వెంకటాచలం నుంచి పోర్టుకు రూ.50 కోట్లతో రైల్వే లైన్‌ నిర్మాణం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ నుంచి కంటైనర్లు ఎగుమతి, దిగుమతి సాగింది, రైల్వేకు భారీగా ఆదాయం వచ్చిందన్నారు. ఇప్పుడు టెర్మినల్‌ మూత వేస్తే త్రీవంగా నష్టపోవడం తోపాటు సుమారు 5 వేల మంది కార్మికులు పనులు కోల్పోతున్నారన్నారు. సమా వేశంలో మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పి. నారాయణ, అబ్దుల్‌ అజీజ్‌, మాజీ ఎంఎల్‌ఎలు పి. సునీల్‌కుమార్‌, కంభం విజయ రామిరెడ్డి, పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, బొజ్జల సుధీర్‌రెడ్డి, టి.అనురాధ తదితరులు పాల్గొన్నారు

➡️