క్షయ నిర్మూలనకు సమిష్టి కృషి

Mar 24,2024 22:29

ర్యాలీని ప్రారంభిస్తున్న డిఎంహెచ్‌ఒ తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు:
ప్రపంచ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించటానికి స్థానిక డిఎంహెచ్‌ఒ కార్యాలయం నుండి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.విజయలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిజిహెచ్‌ సుశ్రుత హాల్లో సదస్సు నిర్వహించారు. డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు క్షయ వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. క్షయ వ్యాధి నివారించ తగిన జబ్బేనని అన్నారు. ఈ వ్యాధి నిర్థారణకు ఇప్పుడు సిబినాట్‌, ట్రూనాట్‌ వంటి పద్ధతులు వచ్చాయని రెండు గంటల వ్యవధిలోనే వ్యాధి నిర్ధారణ చేసే విధంగా పరీక్షలు ఉన్నాయని వివరించారు. ఈ వ్యాధికి ప్రస్తుతం అన్ని రకాల మందులు ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా అందచేస్తున్నట్లు చెప్పారు. సదస్సులో జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌, ప్రముఖ శ్వాసకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్‌ జి.బాబురావు, ఎన్సిడిసిడి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎ.శ్రావణ్‌బాబు తదితరులు ప్రసంగించి క్షయ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. ర్యాలీలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, క్షయ నివారణ అధికారి డాక్టర్‌ డి.శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్‌ న్యూక్లియస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మణ్‌ నాయక్‌, డాక్టర్‌ జె.త్రివేణి, డాక్టర్‌ ప్రవీణదీప్తి, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️