గుంటూరు ఛానల్‌ విస్తరణకు నిధులివ్వాలి

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం జిల్లా కమిటీ తీర్మానించింది. శుక్రవారం బ్రాడిపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు పెట్రోలు, డీజిల్‌ వంట గ్యాస్‌ ధరలు పెరిగిపోయాయని, మరోవైపు ప్రజలకు సరిపడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలుకు రాజధాని నిర్మాణానికి, విశాఖ రైల్వేజోన్‌కు, కడప ఉక్కు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని వాగ్దానం చేసి అమలు జరపకుండా మాట తప్పి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. అయితే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు కేంద్రం విధానాలపై పోరాడకుండా రాజీధోరణిని అవలంబిస్తున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.సిపిఎం జిల్లా పాశం రామారావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించాలని వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఛానల్‌ను పొడిగిస్తే 5 మండలాలు 50 గ్రామాలలో సాగునీరు, తాగునీరు నిరాఘంటంగా అందుతాయని, ఆ ప్రాంతం వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించడానికి అవకాశముందని వివరించారు. గతంలో అధికార, ప్రతిపక్షాలు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు పట్టాలివ్వాలని కోరారు. పట్టణాలు, నగరాలలో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రణాళికాబద్ధమైన డ్రెయినేజీ వ్యవస్థను రూపొందించాలన్నారు. పత్తి, మిర్చి, వరి పంటల వస్తున్నాని, వాటిని ప్రభుత్వం మద్దతు ధరకు కొనగోలు చేయాలడి కోరారు. మేడికొండూరు మండలం శిరిపురంలో నకిలీ మిర్చి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు కంపెనీ యాజమాన్యం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెదవడ్లపూడి హైలెవెల్‌ ఛానల్‌ను పూర్తి చేసి వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని, మాస్టిన్‌ సామాజిక తరగతులకు కుల ధ్రువపత్రాల జారీలో తీవ్రజాప్యం వల్ల విద్యార్థులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చెప్పారు. ఎస్సీలకు శ్మశాన స్థలాలు చాలట్లేదని, జిల్లాలో అనేక చోట్ల వున్న స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, శ్మశాన స్థలాలు కేటాయించాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో జిల్లా నాయకులు ఇ.అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, కె.నళీనికాంత్‌, ఎం.రవి, ఎస్‌ఎస్‌.చెంగయ్య, బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి, ఎల్‌.అరుణ, ఎంఎ.చిస్టీ పాల్గొన్నారు.

➡️