గుండెల నిండా ఎర్రజెండా

Apr 23,2024 22:13

ఎరుపెక్కిన కురుపాం

ఆకట్టుకున్న డప్పు వాయిద్యాలు, కోలాట నృత్యాలు

 ప్రజాశక్తి – కురుపాం /గుమ్మలక్ష్మీపురం :  ఇండియా వేదిక పార్టీలు బలపరిచిన సిపిఎం కురుపాం నియోజకవర్గ అభ్యర్థి మండంగి రమణ గిరిజనులు, వామపక్ష శ్రేణుల కోలాహలం మధ్య మంగళవారం నామినేషన్‌ వేశారు. తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి వివి రమణకు అందజేశారు. అంతకుముందు రావాడ రోడ్డు నుంచి దూళికేశ్వర ఆలయం వరకు సుమారు కిలోమీటరు పొడవున భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పుల వాయిద్యం, మహిళల కోలాట నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన గిరిజనులు, దళితులు, కార్మికులు, సిపిఎం, సిపిఐ శ్రేణులు, కాంగ్రెస్‌ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన అభ్యర్థి మండంగి రమణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, కె.సుబ్బరావమ్మ, నాయకులు పాల్గొన్నారు. వందలాది మందితో నిర్వహించిన ర్యాలీతో కురుపాం వీధులు ఎర్రజెండాలతో ఎరుపెక్కాయి. మరోవైపు ఎండ వేడిమిని తట్టుకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులు సిపిఎం పార్టీపై ఉన్న అభిమానంతో దారి పొడవున నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. అభ్యర్థి మండంగి రమణ దారి పొడవున ప్రజలకు , బస్సుల్లో ఆటోలో వస్తున్న ప్రయాణకులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మహిళలు, పారిశుధ్య కార్మికులు, మోటార్‌ యూనియన్‌ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు ఇచ్చారు. అనంతరం సిపిఎం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ సభ్యులు కోలక అవినాష్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిగా హాజరైన సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి ప్రసంగించారు. రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులు, చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్‌ వ్యక్తులతో చేతులు కలిపి పరిశ్రమల పేరుతో గిరిజనులను అడవి నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. గిరిజన సంఘం, సిపిఎం పోరాటాల ఫలితంగానే 1/70 చట్టం, అటవీ హక్కులు చట్టం, పిసా చట్టం, ఉపాధి హామీ చట్టం సాధించుకున్నామని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాక ఈ చట్టాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిఒ నెంబర్‌ 3 ఎత్తివేయడంతో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులైన మండంగి రమణ, అప్పల నర్సను గెలిపించి చట్టసభలకు పంపించిన నాడే గిరిజన జీవనానికి రక్షణగా ఉంటుందని అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసిదాస్‌ మాట్లాడుతూ సిపిఎం పోరాట ఫలితంగా ఏజెన్సీలో అనేక సమస్యలను పరిష్కరించుకో గలిగామన్నారు. పేదలు కార్మికులు గిరిజనులు దళితుల పక్షాన ఉండి పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని అన్నారు. ఈ కారణంగానే ధరలు పెరుగుదల, నిరుద్యోగం వెంటాడుతున్నాయని అన్నారు. సిపిఎం సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ సిపిఎం పోరాట ఫలితంగా గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పూర్ణపాడు లాబేసు వంతెన మంజూరు అయిందన్నారు. డిగ్రీ కళాశాల పూర్తయినా, పూర్ణ పాడు లాబేసు వంతెన పనులు నిలిచిపోయాయని తెలిపారు. టిడిప,ి వైసిపి పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప వంతెనను పూర్తిచేసే ఆలోచన లేకపోవడం దుర్మార్గపు పాలనకు నిదర్శనం అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి రమణను గెలిపిస్తే ఏడాది లోపు వంతెన పూర్తి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా గిరిజనులకు హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ తనను ఆశీర్వదించాలని గిరిజనుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తానని అన్నారు. గత 15 ఏళ్లగా కురుపాం నియోజకవర్గంలో ఏనుగులను తరలించే చర్యలు చేపట్టడంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పల నరసయ్య మాట్లాడుతూ బాక్సైట్‌ తవ్వకాల పేరుతో అడవి నుంచి దూరం చేసే కుట్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు చట్టాలను కాపాడుకోవాలంటే రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిపించి చట్ట సభలకు పంపించాలని కోరారు. కాంగ్రెస్‌ డిసిసి ఉపాధ్యక్షులు డి.శంకర్రావు మాట్లాడుతూ యుపిఎ హయాంలో అనేక విషయాలపై ఉమ్మడిగా సాధించామని, మళ్లీ ఇండియా వేదికను గెలిపిస్తే ప్రజలకు మేలు జరగుతుందని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై గళం వినిపించాలంటే ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు, నాయకులు కొల్లి గంగు నాయుడు, వై.మన్మధరావు, వి.ఇంందిర, మండంగి శ్రీను, కోరంగి సీతారాం, కొల్లి సాంబమూర్తి, బి.వెంకటరమణ, సిపిఐ, కాంగ్రెస్‌ కార్యకర్తలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

➡️