చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన

Dec 21,2023 21:35

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  తెలంగాణ కంటే వేతనాలు పెంచుతామన్నా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని , సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా గురువారం చెవిలో పువ్వులు పెట్టుకొని అంగన్వాడీలంతా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిఐటియు నాయకులు ఎ.జగనోహాన్‌, యుఎస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పేరుతో సమస్యలు పరిష్కారం చేయకుండా తమ చెవుల్లో పువ్వులు పెట్టిందని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి మహిళా పక్షపాతి అని చెప్పుకోవడమే తప్ప మహిళలు పది రోజులుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెకు ఎపిటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎ.సదాశివరావు మద్దతు తెలిపారు.

గజపతినగరం : అంగన్‌వాడీలంతా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. సమ్మెకు మద్దతుగా పలువురు తల్లులు తమ పిల్లలతో కలిసి సమ్మెలో పాల్గొన్నారు. చిన్నారులంతా ‘జగన్‌ మామయ్యా.. మా టీచర్ల జీతాలు పెంచండి’.. వారు సెంటర్‌కు వస్తేనే మేము కూడా సెంటర్‌కు వస్తాం..’ అంటూ పలకలపై రాసి నిరసన శిబిరంలో ప్రదర్శించారు. యూనియన్‌ నాయకులు వి.లక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుభాషిని, పి.జ్యోతి, నాగమణి, రాములమ్మ, సన్యాసమ్మ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

రామభద్రపురం : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించ కుండా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుందని ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ పిలుపు నిర్చారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్వహిస్తున్న శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ కోలాటం ఆడుతూ నిరసన తెలిపారు. సిఐటియు మండల కార్యదర్శి బలస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు రోడ్లు జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

బొబ్బిలి : మున్సిపల్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం ఉధతం చేస్తామని చెప్పారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఉమాగౌరి, రోజా, అంగన్వాడీలు పాల్గొన్నారు.

చీపురుపల్లి: అంగన్‌వాడీలంతా చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలు పరిష్కరించ కుంటే సమ్మె మరింత ఉధతం చేస్తామని అంగన్‌వాడీలు అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు బలగ నాగమణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంట్యాడలో చెవిలో పువ్వులు పెట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు

జామి : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షల్లో అంగన్‌వాడీలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాడి అప్పారావు, యూనియన్‌ నాయకులు కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, కార్యకర్తలు, పాల్గొన్నారు.

శృంగవరపుకోట : ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదురుగా సమ్మె శిబిరం వద్ద వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడారు. చెలికాని ముత్యాలు, ప్రాజెక్టులీడర్ల్‌ డి శ్యామల, డి.జయలక్ష్మి, ఎఐటియుసి నాయకులు వి.మాణిక్యం, బి.సుశీల పాల్గొన్నారు.

బాడంగి : ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి బదులు సమ్మె విచ్ఛిన్నం కోసం యత్నిస్తోందని సిఐటియు నాయకులు అన్నారు. గురువారం అంగన్‌వాడీ కేంద్రాల వద్దకు వెళ్లి తెరిచిన కేంద్రాలను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. వాటిల్లో విధులు నిర్వహిస్తున్న ఎఎన్‌ఎం, ఆశా కార్యక ర్తలతో మాట్లాడి వారి విధులను సచివాలయం నుండి నిర్వహించుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలకు రావొద్దని కోరారు.

25 నుంచి అంగన్వాడీల సమ్మెను ఉధృతం

భోగాపురం : ఈనెల 25 నుంచి అంగన్వాడీల సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టివి రమణ అన్నారు. తాహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె చేస్తామని ఆయన అన్నారు. అంతకుముందు అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి బిక్షటన చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి సూర్యనారాయణ, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎం.కృష్ణవేణి, సెక్టార్‌ లీడర్లు పి.అనిత, పి .చిన్నమ్మలు, పి.సుజాత, కె.ప్రవీణ పాల్గొన్నారు.

➡️