జిఒ3ను పునరుద్ధరించిన వారికే మా ఓటు

Jan 30,2024 20:31

ప్రజాశక్తి -కలెక్టరేట్‌ : జిఒ 3ను పునరుద్ధరించిన వారికే తాము మద్దతు తెలిపి ఓటేస్తామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గిరిజన విద్యారంగంలోని సమస్యలు పట్ల ఉపాధ్యాయ, విద్యార్థి, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోస్థానిక ఐటిడిఎ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. 8.98 శాతం గిరిజనులున్నప్పటికీ జిఒ 3ను సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఇప్పటికీ ప్రభుత్వాలు ఈ జీవో పునరుద్ధరణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. జిఒ 3పునరుద్ధరణతోనే ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, కావున ఈ జిఒను పునరుద్ధరించిన వారికే తమ ఓటు అని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం గిరిజన విద్యారంగంలో జిఒ117ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుందని, ఇదివరకే పాఠశాల విద్యారంగంలో ఈ జిఒ అమలు ద్వారా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కావున ఆశ్రమ, గిరిజన పాఠశాలల్లో జిఒ 177ను అమలు చేయరాదని డిమాండ్‌ చేశారు. సవర భాషా వాలంటీర్లకు 10 నెలల జీతాలు చెల్లించాలని, వారికి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సిఆర్టి ఉద్యోగులందర్నీ రెగ్యులర్‌ చేయాలని, హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ ఛార్జీలు పెంచాలని, రోజుకు 100 రూపాయల మెస్‌ ఛార్జిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ మురళీమోహన్రావు మాట్లాడుతూ సవర భాష వాలంటీర్లను మార్చి, ఏప్రిల్‌లోనూ కొనసాగించా లని, హెచ్‌ఎం, ఎస్‌ఎ ప్రమోషన్‌ వెంటనే ఇవ్వాలని, జాతపు, గదబా భాష వాలంటీర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షులు టి రమేష్‌ మాట్లాడుతూ ప్రతి ఆశ్రమ పాఠశాలలో నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ను నియమించాలని, ప్రతి జిపిఎస్‌ పాఠశాలకు ఇద్దరూ ఎస్‌జిటిల నియమించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఐటిడిఎ డిడికి వినతిపత్రం అందజేశారు, సమస్యలపై స్పందించిన డిడి మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హెచ్‌ఎం, ఎస్‌ఎ ప్రమోషన్లు పారదర్శకంగా నిర్వహిస్తామని, అక్రమ డిప్యూటేషన్ల కు తావు లేకుండా డిప్యూటేషన్లన్నీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, విధాన పరమైన సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘాల జిల్లా నాయకులు కె.భాస్కరరావు, పి.వెంకటనాయుడు, రాజు, సింహాచలం, అవినాష్‌, రాము, రమణ, సవర భాష వాలంటీర్ల జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సవర భాష వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️