జెఎఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

Mar 13,2024 21:50

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ :  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ అన్నారు. పట్టణ పరిధిలో గల కొత్తవలస సచివాలయం -1 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష 2 కార్యక్రమాన్ని నిర్వాసితుల కాలనీ నవిరి కమ్యూనిటీ భవనం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్‌ బోను గౌరీశ్వరి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సదుపాయాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొంటే ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయబడుతుందని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులను, వైద్యాధికారులను నియమించి జీవనశైలి వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. అలాంటి వారిని గుర్తించి వైద్యులతో చికిత్స అందిస్తున్నారని, అవసరమైతే మందులు ఇంటికే తీసుకెళ్లి అందిస్తున్నారని తెలిపారు. రోగులు క్రమం తప్పకుండా మందులు వాడేలా సురక్ష కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారని, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు గుండె, కిడ్నీ జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు వస్తే, వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీంతో పాటు, వారు గతంలో వాడుతున్న మందులు అందించే ఏర్పాట్లు చేశారని అన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డుల వైసిపి నాయకులు, వైద్యాధికారులు, వైద్యులు, ఎఎస్‌ఒ వీరినాయుడు, వైద్య సిబ్బంది, రోగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

➡️