డ్వాక్రాలకు సున్నా వడ్డీ వర్తింపజేయాలి

Feb 10,2024 00:07 #ఐద్వా
ఐద్వా

ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి

ప్రజాశక్తి- ములగాడ: డ్వాక్రా సంఘాలన్నింటికీ సున్నా వడ్డీ వర్తింపజేయాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి డిమాండ్‌ చేశారు. శుక్రవారం 63వ వార్డు క్రాంతినగర్‌లో ఆంధ్రప్రదేశ్‌ డ్వాక్రా సంక్షేమ సంఘం. మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏరియా కార్యదర్శి వై కల్యాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు స్వయంఉపాధికి శిక్షణనిచ్చి, ఆర్థికస్వావలంబనకు ఉపాధి అవకాశాలను కల్పించాలని, డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రుణమాఫీ, గ్యాస్‌ సిలెండర్లు, ఇతరత్రా తాయిలాలతో ఎరవేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించడం సరికాదన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వంటగ్యాస్‌, పెట్రోల్‌,డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడంద్వారా వాటి ప్రభావం అన్ని వర్గాల ప్రజలపై పడేలా చేస్తోందని దుయ్యబట్టారు. ఇక రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం నిత్యావసరాలతోపాటు అన్ని ధరలను, కరెంట్‌, బస్‌ఛార్జీలను విపరీతంగా పెంచేయడంతోపాటు చివరకు చెత్తను కూడా వదలకుండా పన్నులు విధించి, వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మహిళలంతా సంఘటితంగా వీటిపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఐద్వా మల్కాపురం జోన్‌ కార్యదర్శి ఆర్‌.విమల మాట్లాడుతూ, విశాఖ నగరంలో తొలిసారిగా ఈనెల 22 నుంచి 25వకు ఐద్వా జాతీయ సమావేశాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ఈనెల 22న వేలాది మహిళలతో భారీ ప్రదర్శన, బహిరంగసభలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా నాయుకులు ఎం.లక్ష్మి, కె.అన్నపూర్ణ, పి.వరలక్ష్మి, బి.రాజేశ్వరి, టి.అసిమ్మ, ఆదిలక్ష్మి, గోవిందమ్మ, ఊర్మిళ, గీత, రవణమ్మ, దొడ్డమ్మ,లక్ష్మి పాల్గొన్నారు. మహిళా హక్కుల సాధనకు ఐద్వా కృషిగోపాలపట్నం : మహిళా హక్కుల సాధనకు ఐద్వా నిరంతరం పోరాడుతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి వై సత్యవతి అన్నారు. శుక్రవారం జివిఎంసి 90వ వార్డు విమాన నగర్‌లో ఐద్వా గోపాలపట్నం శాఖ అధ్యక్షురాలు వి.ప్రభావతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, ఇంకా అక్కడక్కడ పురుషాధిక్యత కనిపిస్తోందన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి, హక్కులసాధనకు సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలోఈ నెల 23, 24,25 తేదీల్లో నిర్వహించే ఐద్వా జాతీయ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా ఐద్వాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విసిసి కన్వీనర్‌ బి.లీలావతి, ఐద్వా నేతలు బి.కాంతం, ఎస్‌ లక్ష్మి మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

సమావేశంలో మాట్లాడుతున్న ప్రభావతి

➡️