తుపాను బాధితు రైతులందరికీ పరిహారం ఇవ్వాలి

మంగళగిరి వద్ద పడిపోయిన వరిపైరును పరిశీలిస్తున్న రైతు సంఘం, సిపిఎం నాయకులు
ప్రజాశక్తి – మంగళగిరి :
తుపాను వలన కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు డిమాండ్‌ చేశారు. గురువారం మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు సమీపంలో గల వరి పంటను సిపిఎం, రైతు సంఘాల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడుతూ రైతులు వేల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారని, వర్షాలు కురవడం వలన తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఒక్కొక్క ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, రైతు సంఘం నాయకులు ఎం.పకీరయ్య, ఎన్‌.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – తాడికొండ : తుపాను కారణంగా మండలంలో జొన్న, శనగా, మినుము, వరి రైతులు పూర్తిగా నష్టపోపోయారని, పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అజరుకుమార్‌ మాట్లాడుతూ పైరు పచ్చగా కనబడుతున్నా నీళ్లు నిలబడి ఉరకెత్తుతోందని, పంట చేతికొచ్చే పరిస్థితి లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టం అంచనా వేయాలని కోరారు. ముక్కుబడిగా రాసుకొని రెండు మూడు సంవత్సరాల అనంతరం రూ.20 వేలు చెల్లించడం వలన ఉపయోగం లేదన్నారు. రైతు నిలబడాలంటే నష్టం జరిగిన వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు ఉచితంగా అందించాలని, క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమై నష్టపరిహారం అంచనా వేయాలని డిమాండ్‌ చేశారు. కొండవీటి వాగు ముంపు సమస్య తీర్ఘకాలికంగా ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమస్యను పరిష్కరిస్తే పొలాలు ముంపుబారిన పడవని చెప్పారు. గత సంవత్సరం ముంపు గురైనప్పుడు తూటికాడ పిచ్చి మొక్కలు అడ్డు ఉండటం వలన బాగుచేయడం కుదరలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశీలనలో నాయకులు కె.పూర్ణచంద్రరావు, వై.లక్ష్మా రడ్డి, సిహెచ్‌.భాస్కరరావు, పిచ్చిరెడ్డి, రామారావు, మహేష్‌, రైతులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి – దుగ్గిరాల : తుపానుతో పంట నష్టపోయిన రైతులకు వరి పంటకు ఎకరాకు రూ.20 వేలు, వాణిజ్య పంటలకు రూ.50 వేలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు కోరారు. ఈ మేరకు డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని పంటలు పండిస్తే అవి చేతికందే సమయంలో తుపాను నీళ్ల పాలుచేసిందని ఆవేదన వెలిబుచ్చారు. రెండవ పంటకు జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర విత్తనాలు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. పొలాల్లో ఉన్న నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రములో ఎన్‌.యోగేశ్వరావు, వై.బ్రహ్మేశ్వరావు, కె.కోటయ్య, కె.దావీదు, ప్రభాకర్‌, సిహెచ్‌ పోతురాజు పాల్గొన్నారు.

➡️