తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి- గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి రూరల్‌ : గత రెండు రోజుల నుండి తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో వరిపంటకు తీవ్రనష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని మండలాల్లో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలను సిపిఎం ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ అనేక వ్యయ ప్రయాసాలకోర్చి రైతులు పంటలు పండిరచారన్నారు. ఎకరాకు రూ.30-35 వేలు ఖర్చు చేశారని, పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన తుపాను వల్ల కోత దశలో ఉన్న పంట నీటిలో మునిగిందని, వరి పైరు కిందకి వంగి నీటిలో తేలుతోందని చెప్పారు. ఎకరాకు 10-15 బస్తాలు దిగిబడి తగ్గే ప్రమాదముందన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతు భరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనగోలు చేయాలని, తేమ శాతం పరిగణలోకి తీసుకోకుండా కొనాలని కోరారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పత్తి తీవ్రంగా దెబ్బతిన్నదని, మిర్చి పొలాలల్లో నీరు నిలిచి ఉరకెత్తే ప్రమాదముందని చెప్పారు. చేబ్రోలు, నారాకోడూరు, కాజ, తాడేపల్లి ప్రాంతాల్లో కూరగాయలు, ఆకు కూరల తోటలు తుపాను ప్రభావానికి గురయ్యాయని, అనేక చోట్ల ధాన్యం ఆరబోసి కళ్లాలపై ఉందని తెలిపారు. కింద, పైనా పరదా పట్టాలు వేసినా నీరు చేరి తడిసి పోతున్నాయనన్నారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టాలని, పరదా పట్టాలు సరఫరా చేయాలని కోరారు. అరటి పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రూ.12-25 వేల వరకు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాని, తుపాను వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పొలాల్లో అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థలు సక్రమంగా లేక రోడ్లపై మురుగు చేరిందని, దీనివల్ల ప్రజలు అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. వైద్యారోగ్య శాఖ వెంటనే స్పందించి తాగునీటికి క్లోరినేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశీలనలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈమని అప్పారావు, నాయకులు కె.నాగేశ్వరరావు, ఎస్‌.ఆదిశేఖర్‌, మాధవరెడ్డి, సత్యామారెడ్డి, జె.బాలరాజు, నాగమల్లేశ్వరరావు, యోగేశ్వరరావు, ప్రకాశరావు, రామారావు, శ్రీనివాసరెడ్డి, పేరిరెడ్డి పాల్గొన్నారు.

➡️