దూషిస్తున్న పీడీని బదిలీ చేయాలి

విలేకర్లతో మాట్లాడుతున్న నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు విశేష సేవలందిస్తూ ఆన్‌లైన్‌, రికార్డు వర్క్‌ తదితర పనులతో వెట్టి చాకిరీ చేస్తున్న అంగన్వాడీలను ఐసిడిఎస్‌ ఇన్‌ఛార్జి పీడీ బి.అరుణ సెంటర్ల తనిఖీల సందర్భంలో అసభ్యకరంగా దూషించడం సరికాదని, ఆమె తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని అంగన్వాడీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ డిమాండ్‌ చేశారు. నరసరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఆయన సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, సిఐటియు నరసరావుపేట మండల అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌తో కలిసి విలేకర్లతో మాట్లాడారు. సమ్మె సందర్భంగా అంగన్వాడీలను తాము కలిశామని, ఈ క్రమంలో ఇన్‌ఛార్జి పీడీ దురుసు ప్రవర్తన గురించి పలువురు వివరించి కన్నీటి పర్యంతమయ్యారని తెలిపారు. ఆమెను ఉన్నతాధికారులు బదిలీ చేసి మరొకర్ని నియమించాలని, లేకుంటే పీడీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తగా పీడీ వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం నుండి ఆదేశాలేమీ లేకున్నా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఈపూరు మండలం సిడిపిఒగా పనిచేసిన ఆమెపై అవినీతి ఆరోపణులున్నాయని, వేధింపులకు పాల్పడ్డారనే విమర్శలూ ఉన్నాయని చెప్పారు. ఆమె తీరు ఒక అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి దారితీసిందని గుర్తు చేశారు. తాజాగా ఈపూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సమ్మెలో ఉన్న అంగన్వాడీలతో దురుసు వ్యవహరించారన్నారు. జిల్లాస్థాయి అధికారి తన హోదాను మరచి ప్రవర్తించడం సరికాదన్నారు.

➡️