నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Dec 10,2023 20:53

 ప్రజాశక్తి – విజయనగరం కోట   :    రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం రైతులను ఉక్కుపాదంతో తొక్కాలని చూస్తోందని టిడిపి సీనియర్‌ నాయకులు కిమిడి కళావెంకటరావు మండిపడ్డారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఒక ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను కారణంగా రైతులకు చేతికొచ్చిన పంట చేరకుండా నీటి పాలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రైతులకు సకాలంలో నీరు ఇవ్వలేదు సరికదా, సాయం చేసేందుకు కూడా వెనుకాడుతోందని అన్నారు. తోటపల్లి, నాగావళి నదుల్లో 3 టిఎంసిల నీరు ఉన్నప్పటికీ రైతులకు సకాలంలో అందించలేకపోయారని తెలిపారు. తోటపల్లికి వస్తున్న నీరు రాకుండా అడ్డు కుంటున్న గడ్డిని తొలగించడానికి ఇంజనీర్లు రూ. 10 కోట్లు లేదా మూడు కోట్ల రూపాయలు అయినా ఇవ్వండి ఇవ్వాలని ఇచ్చిన వినతులను ప్రభుత్వము పట్టించుకోలేదని అన్నారు. ఇటు ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఈ జిల్లాల్లో ఖరీఫ్‌ సీజన్లో రూ.2వేల కోట్ల విలువైన పంట పండుతుందని, కానీ, ప్రభుత్వం సకాలంలో నీరందించక నష్టపోతున్నారని అన్నారు. వర్షాభావంతో 75శాతం పంట పోతే, మిగతా 25శాతం తుపాను వల్ల పోయిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బస్తాకు రూ.1600 ధర నిర్ణయిస్తే ఇక్కడ దళారులు రూ.800కే అడుగుతున్నారని ఆవేదన చెందారు. రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తుపానుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️