నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు

Mar 28,2024 21:06

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. మున్సిపాల్టీకి సంబంధించి తోటపల్లి బూస్టర్‌ పంప్‌ హౌస్‌ను కమిషనర్‌ గురువారం మున్సిపల్‌ డిఇ కిరణ్‌ కుమార్‌, ఎఇ ఆనంద్‌తో కలిసి సందర్శించారు. అక్కడ ఉన్న నాలుగు ఇన్‌ఫిల్టరేషన్‌ బావులను పరిశీలించి రాబోయే వేసవి దృష్ట్యా నీటి సామర్ధ్యం నిల్వ ఉండేలా నదిలో ఇసుక బస్తాలతో బండ్‌ ఏర్పాటు చేసి నీటిని ఊట బావుల వైపు మళ్లించి నీరు ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకావాలని, అదనంగా కావాల్సిన నీటి సేకరణకు ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా మున్సిపల్‌ డిఇ, ఎఇకి సూచించారు.తాగునీటి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాలితాగునీటి సరఫరా జరిగే తీరుపై వార్డు సచివాలయాల ఎమినిటీ సెక్రటరీలు ప్రత్యేక పర్యవేక్షించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం కమిషనర్‌ చాంబర్లో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతోనూ, 15వ వార్డు సచివాలయాల ఎమినిటి సెక్రటరీలతోనూ తాగునీటి సరఫరాపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ ఎమినిటీ సెక్రెటరీలతో మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా పట్టణ ప్రజలు తాగునీటి సరఫరా జరుగుతున్న సమయంలో పర్యవేక్షించాలని, పైపు లైన్లలో లీకులను గుర్తించేందుకు పర్యవేక్షించాలని, మీమీ వార్డు పరిధిలో మరమ్మతైన చేతి బోర్లును గుర్తించి ఇంజనీరింగ్‌ అధికారులకు తెలియజేయాలని అన్నారు. క్లోరినేషన్‌ పరిశీలిస్తున్న తీరును కూడా పర్యవేక్షించాలని, వేసవి దృష్ట్యా పట్టణ ప్రజలకు తాగునీట సరఫరాలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా తెలియజేసేందుకు మున్సిపల్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. దీన్ని పట్టణ ప్రజల సద్వినియోగం చేసుకోనేలా 15వ వార్డు సచివాలయాల్లో ఉన్న ఎమినిటి సెక్రటరీలు ఆయా వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న స్థానికులకు తెలియజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో డిఇ కిరణ్‌ కుమార్‌, సచివాలయ ఎమినిటి సెక్రటరీలు పాల్గొన్నారు.

➡️