నెరవేరని డిప్యూటీ సిఎం కోరిక

Jan 12,2024 21:45

ప్రజాశక్తి – సాలూరు : డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర కోరిక నెరవేరలేదు. ఎంపిగా పోటీ చేయాలన్న వాంఛ కలగానే మిగిలిపోతోంది. గత ఎన్నికల్లో కూడా ఆయన ఎంపి సీటు కావాలని కోరారు. కానీ వైసిపి అధిస్థానం ఆయన్ను ఎమ్మెల్యే గానే బరిలోకి దించింది. ఈ సారి ఎన్నికల్లో నైనా అరుకు ఎంపి సీటు కావాలని ఆయన పార్టీ నాయకత్వానికి అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన అభ్యర్థినని అధిస్థానం పరిగణనలోకి తీసుకున్న దాఖలాల్లేవు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అరుకు ఎంపి అభ్యర్థిగా పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మిని పార్టీ ఖరారు చేసింది. దీంతో రాజన్నదొర ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా పోటీలో ఉంటే గెలుపు సునాయాసమవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు. మరో మూడు నెలల్లో రానున్న ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకం కావడంతో ఎమ్మెల్యేల గెలుపు అవసరమని అధిస్థానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడమే ఉత్తమమని నాయకత్వం భావించినట్లు కనిపిస్తోంది. 2004లో మొదటిసారి రాజన్నదొర ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండేళ్లకు ఎమ్మెల్యేగా అదృష్టం ఆయన్ను వరించింది. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌ కులవివాదంపై రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు కోర్టు ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఆయన విజయపరంపర కొనసాగించారు. డిప్యూటీ సిఎంను కలిసిన పాడేరు ఎమ్మెల్యేడిప్యూటీ సిఎం పి.రాజన్నదొరను శుక్రవారం పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్షి మర్యాదపూర్వకంగా కలిశారు. క్యాంప్‌ కార్యాలయంలో రాజన్నదొరను కలిసిన భాగ్యలక్ష్మి అరుకు ఎంపిగా తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఇటీవల వైసిపి అధిస్థానం అరుకు ఎంపి అభ్యర్థిగా కె.భాగ్యలక్ష్మీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆమె రాజన్నదొరను కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

➡️