నేటి నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 25,2023 23:03
మున్సిపల్‌ కార్మికుల

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌

నేటి నుంచి మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. సమస్యలపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, వివిద రూపాల్లో ఆందోళనలు నిర్వహించినా సర్కారులో ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు.ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో, పలు సభల్లో పాల్గొన్న జగన్‌ తాను అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారు. కాని నేటికీ అమలు చేయలేదు. ముఖ్యంగా మున్సిపల్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా వారిని ఇంత వరకూ పర్మినెంట్‌ చేయలేదు. సమాన పనికి సమాన వేతనం ఎక్కడా అమలు కావట్లేదు. ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌, హెల్త్‌ అలవెన్స్‌ అందట్లేదు. పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలో పనిచేస్తున్న చెత్త తరలించే వాహన డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ మెయింటినెన్స్‌, పార్కులలో పనిచేసే కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ అందట్లేదు. జిఒ 38ను సవరించి కార్మిక శాఖ ప్రతిపాదన మేరకు వాటర్‌ సప్లై, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ార్మికులు, చైన్‌. దళం, డ్రైవర్లకు కార్మిక శాఖ ప్రతిపాదనల మేరకు జీతాల చెల్లించాలని కోరుతున్నారు. సర్టిఫికెట్స్‌ లేవనే సాకుతో ఇంజినీరింగ్‌ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది స్కిల్డ్‌, సెమీస్కిల్డ్‌ జీతాలు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 వేతనం, విలీన గ్రామాలు, కరోనా, వరదలు సమయంలో కొత్తగా తీసుకున్న కార్మికులకు మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీతాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. హెల్త్‌ అలవెన్స్‌, పట్టణాల విస్తరణ మేరకు సిబ్బందిని పెంచాలని, ఆప్కాస్‌ ద్వారా రిటైర్మెంట్‌ చేసిన వారి బిడ్డలకు ఉద్యోగాలు, స్కూల్‌ స్వీపర్లకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల పర్మినెంట్‌, పర్మినెంట్‌ కార్మికులకు సంబంధించి సరెండర్‌ లీవులు తదితర సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 8న మున్సిపల్‌ శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలం సురేష్‌కు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి, సి అండ్‌ డిఎంఎ పి.కోటేశ్వరావులకు యూనియన్‌ రాష్ట్ర నాయకత్వం సమ్మె నోటీసులు అందించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి సమక్షంలో డిసెంబర్‌ 14న జరిగిన చర్చలలో ప్రధానమైన డిమాండ్లు పర్మినెంట్‌, సమాన పనికి సమాన వేతనం, ఇంజనీరింగ్‌ కార్మికులకు రిస్కు హెల్త్‌ అలవెన్స్‌ క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 జీతం తదితర డిమాండ్లపై స్పష్టమైన హామీ రాలేదు. దీంతో తప్పని సరిపరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఎపి మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ మేరకు 26వ తేదీ తెల్లవారుజాము నుంచి కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొనాలని, ప్రజలు మద్దతు ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు.

➡️